Share News

వెండి కాదు.. అల్యూమినియం! హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ దందా గుట్టురట్టు

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:14 PM

హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. చార్మినార్, ఫలక్‌నుమా పరిధిలోని నాలుగు కేంద్రాల్లో అల్యూమినియం ఆకులతో తయారు చేసిన సిల్వర్ ఫాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వెండి కాదు.. అల్యూమినియం! హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ దందా గుట్టురట్టు
Fake Silver Foil

హైదరాబాద్, నవంబర్ 17: నగరంలో నకిలీ సిల్వర్ ఫాయిల్ (Silver Foil) తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. చార్మినార్, ఫలక్‌నుమా పరిధిలోని నాలుగు కేంద్రాల్లో అల్యూమినియం ఆకులతో తయారు చేసిన నకిలీ సిల్వర్ ఫాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 49 బండిళ్లు, 13 కిలోలకు పైగా అల్యూమినియం ఫ్లేక్స్ సీజ్ చేశారు. నకిలీ సిల్వర్ ఫాయిల్‌ దందా వివరాలను నూతన సీపీ మహేష్ భగవత్ మీడియాకు తెలియజేశారు. హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్‌ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారని.. ఈ సందర్భంగా అసలైన వెండి ‌ఫాయిల్‌కు బదులుగా అల్యూమినియం ఆకులు, ఫ్లేక్స్‌తో నకిలీవి తయారీ చేస్తున్ననట్లు తనిఖీల్లో బయటపడిందన్నారు. ప్రజలకు తెలియకుండా స్వీట్లు, పాన్, బేకరీ ఉత్పత్తుల్లో అల్యూమినియం వినియోగిస్తున్నారని.. అలాగే కాజు కత్లీ, చమ్ చమ్, స్వీట్ పాన్, కేకుల్లో నకిలీ సిల్వర్ ఫాయిల్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.


ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి అల్యూమినియం మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంటున్నారని సీపీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ షాపులకు నకిలీ ఫాయిల్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. మొత్తం నాలుగు కేంద్రాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. చార్మినార్‌లోని ఇత్తెహాద్ వరాక్ షాప్‌, హుస్సేనిఆలంలోని యూటీసీ సిల్వర్ లీఫ్స్, మొఘల్‌పురాలోని ఎం.ఏ. మెట్రో వరాక్ షాప్‌, ఫలక్‌నుమాలోని తారా యూనిట్‌ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడిలో భాగంగా 49 బండిళ్ల నకిలీ సిల్వర్ ఆకులు, 13 కిలోలకు పైగా అల్యూమినియం ఫ్లేక్స్‌ సీజ్ చేశామని.. కిలో నకిలీ షుగర్ బాల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా భారీగా తంబాకు, టాల్కమ్ పౌడర్, పాన్ చట్నీలు పట్టుబడిందన్నారు. తయారీకి ఉపయోగించే మిక్సర్లు, ప్యాకింగ్ మెషిన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. జంతు చర్మాలతో తయారైన ఐదు బుక్స్ షీట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతోందని తెలిపారు.


నకిలీ సిల్వర్ ఫాయిల్ వినియోగంతో కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని సీపీ వెల్లడించారు. నరాల సంబంధిత సమస్యలు, ఎముకల వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. అసలైన వెండి ఫాయిల్‌లో 99.9 శాతం వెండి ఉండాలని.. ఫాయిల్‌ను చేతితో సున్నితంగా రుద్దితే అసలైన వెండి పొడిలా విడిపోతుందని వెల్లడించారు. అల్యూమినియం అయితే చిన్న ముద్ద లేదా బాల్‌లా మారుతుందని.. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని సూచించారు. కెమికల్ టెస్ట్ ద్వారా పరీక్షించినప్పుడు నకిలీ సిల్వర్ ఫాయిల్ నలుపు రంగులోకి మారుతుందన్నారు. ప్రజలు స్వీట్లు, పాన్ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం.. రేవంత్ లెక్కలు తప్పంటూ కవిత విమర్శలు

నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ సోదాలు.. టెండర్ల రికార్డుల పరిశీలన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:55 PM