పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్న తెలంగాణ ప్రజలు: ఎంపీ ఈటల
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:12 PM
తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు వేసి పార్టీ నాయకులకు కేటాయించుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మీ తాత జాగీరు కాదు అలా చేయడానికి అంటూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో కేసీఆర్ పాలనలాగానే.. రేవంత్ రెడ్డి పాలన కూడా ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఐదు కిలోల సన్న బియ్యం ప్రజలకు ఇస్తున్నా.. ప్రధాని మోదీ పోటో వేయడం లేదని మండిపడ్డారు. ఎవరి జాగీరని మీ ఫొటోలు వేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. యూఎస్, యూరప్ వెళ్లి.. భారత్‌లో మత కల్లోలాలు జరుగుతున్నాయని అంటారని విమర్శించారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద ఎవరి హయాంలో బాంబులు పేలాయని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్.. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి మీ ఆశీర్వాదంతోపాటు మీ మద్దతు కావాలంటారని వ్యంగ్యంగా అంటారని తెలిపారు. ఇక్కడికి వచ్చి అదే సీఎం రేవంత్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తారని పేర్కొన్నారు.
మోదీ దేశానికి ప్రధాని కాబట్టే రాష్ట్రానికి ఇన్ని రహదారులు, రైల్వే అభివృద్ధికి నిధులు వచ్చాయని ఎంపీ ఈటల వివరించారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాల అభివృద్ధి ఉందని మోదీ అంటారని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మాకెంటి ఇచ్చేదని అన్నారన్నారు. అలాగే ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు దేశ ప్రధాని మోదీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేర్ చేయలేదన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు మంచిది కాదని.. అరిష్టమని ఆయన తెలిపారు.
తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు వేసి పార్టీ నాయకులకు కేటాయించుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ విమర్శించారు. మీ తాత జాగీరు కాదు అలా చేయడానికి అంటూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రానికి ఎలాంటి వివక్షత లేదన్నారు. మూడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే రూ.100 కోట్లు అధికంగా కేంద్రం ఇచ్చిందన్నారు. మెట్రో ఫేజ్ -1, ఫేజ్ -2 కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్ట పక్కల గ్రామాలను కూడా కలిపారని చెప్పారు. కానీ వాటిని పట్టించుకోవట్లేదని విమర్శించారు.
రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ), రైలు అండర్ బ్రిడ్జ్ (ఆర్‌యూబీ) సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటి నిర్మాణం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం సహకరిస్తుందని.. కానీ రూపాయి ఇవ్వక పోయినా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని కేంద్ర మంత్రి వివరించారని ఎంపీ ఈటల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ సీఎస్‌ను కలిసి మాట్లాడానని రేవంత్ తెలిపారు.
హైదరాబాద్‌లో అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీం పనులు వేగంగా చేయాలని సీఎస్‌ను కోరినట్లు ఎంపీ ఈటల వివరించారు. రైల్వే పెద్ద టెండర్లలో పాల్గొని నగదు తీసుకుంటున్నారని.. కానీ చిన్న చిన్న టెండరల్లో పాల్గొనట్లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీని వల్ల అభివృద్ధి కావడం లేదన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లకు అమృత్ పథకంలో భాగంగా రూ.22 కోట్లు కేంద్రం ఇస్తుందని అన్నారు. అన్ని రైల్వేస్టేషన్లు ఫేస్ లిఫ్టింగ్ చేయడానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. మేడ్చల్, సికింద్రాబాద్ పరిధిలో గేట్ల వద్ద ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణం జరుగుతోందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
చెట్టుకు రాఖీ.. ప్రకృతిపై ప్రేమ చాటిన పర్యావరణ ప్రేమికుడు
For More TG News And Telugu News