నేటి నుంచి 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:51 AM
సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో 1874లో నిర్మించిన 152 ఏళ్ల నాటి రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) విస్తరణ పనులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు.
రాణిగంజ్ బ్రిడ్జి విస్తరణ పనుల నేపథ్యంలో..
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో 1874లో నిర్మించిన 152 ఏళ్ల నాటి రాణిగంజ్ రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) విస్తరణ పనులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు. రాణిగంజ్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతమున్న 11 మీటర్ల రహదారిని 22 మీటర్లకు వెడల్పు చేసే ఈ ప్రాజెక్టు కారణంగా రాబోయే ఆరు నెలల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు విధించినట్లు పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలోపు ఒకవైపు 11 మీటర్ల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.
వాహనదారులకు కీలక సూచనలు
పనుల నిమిత్తం 8 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయడంతో, కేవలం 3 మీటర్ల వెడల్పు గల మార్గంలో మాత్రమే కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ మీదుగా ప్యారడైజ్ వైపు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.
ఈ మార్గంలో లారీలు, డీసీఎంలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
ప్యారడైజ్ నుంచి రోచా బజార్, రాణిగంజ్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను ఆర్‌యూబీకి ముందే ఎడమవైపునకు అడవయ్య చౌరస్తా, డిస్టిలరీ రోడ్డు మీదుగా కర్బాలా మైదాన్ వైపు మళ్లిస్తారు.
సెక్రటేరియట్, అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే భారీ వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి లిబర్టీ వైపు, లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద మళ్లిస్తారు.
ప్యారడైజ్, సీటీఓ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ప్యాట్నీ లేదా రసూల్‌పురా వైపు మళ్లిస్తారు.
క్లాక్‌టవర్, ఎస్‌బీఐ క్రాస్ రోడ్స్, ఘాస్మండీ, మోండా మార్కెట్ వైపు నుంచి రాణిగంజ్ వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి పంపిస్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ హైవేల వైపు రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలి. అత్యవసర వాహనాలు, అంబులెన్సుల కోసం 112 లేదా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
ముందస్తు నోటీసులు ఇవ్వలేదు
రాణిగంజ్ ఆర్‌యూబీ పనులు జరిగే చోట 1958 నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మా మూడో తరం వారు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఉన్నట్లుండి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి? కనీసం ముందుగా నోటీసులు కూడా ఇవ్వలేదు. దుకాణాలు తొలగించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం అన్యాయం. మాకు ప్రత్యామ్నాయం చూపకుండా పనులను ఎలా కొనిసాగిస్తారు.
మహ్మద్ సిద్ధిఖీ, స్థానిక వ్యాపారి