అరకొర దుప్పట్లు.. చలితో ఇక్కట్లు!
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:07 AM
మహానగరంలో చలితీవ్రత పెరిగింది. సాయంత్రం 6 గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి.
శీతాకాలం ప్రారంభమైనా.. పలుచోట్ల పంపిణీ కరువు
గ్రేటర్‌లోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల గజగజ
‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు
హైదరాబాద్ సిటీ: మహానగరంలో చలితీవ్రత పెరిగింది. సాయంత్రం 6 గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. రాత్రి 9 తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతుండడంతో ఇంట్లోని పిల్లలు, పెద్దలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఇదే సమయంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న పిల్లలు, విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్వెట్టర్లు, గ్లౌజులు వేసుకుని వెళ్తున్నారు. అయితే గ్రేటర్‌లోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నిచోట్ల ఇప్పటి వరకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. గురువారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి దృశ్యాలు వెలుగుచూశాయి.
50వేల మందికి పైగా విద్యార్థులు
గ్రేటర్‌లోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో సుమారు 50వేల మందికిపైగా విద్యార్థులు ఉంటున్నారు. ఇందులో ప్రీ మెట్రిక్ హాస్టళ్లు (స్కూళ్లకు వెళ్లే వారు)లో దాదాపు 24 వేల వరకు ఉండగా, మిగతా విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్నారు. ఏటా చలికాలం ప్రారంభం కాకముందే విద్యార్థులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేస్తుండగా, ఈసారి పలు వసతి గృహాల్లో ఇప్పటి వరకు అందలేదు. కొన్నిచోట్ల కిటికీలు, తలుపులు పగిలిపోవడంతో చల్లటి గాలులు లోపలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు.
పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు
ఎస్పీఆర్ హిల్స్‌లోని బోరబండ ఎస్టీ హాస్టల్‌లో ఇప్పటి వరకు విద్యార్థులకు రగ్గులు అందలేదు.
అంబర్‌పేట్‌లోని పోస్టు మెట్రిక్ బాలుర వసతి గృహంలో దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారు.
అంబర్‌పేట్ ఛే నంబర్ సమీపంలోని జిందాల్ తిలిస్మాత్‌రోడ్డులోని ఎస్సీ బాలికల పోస్టు మెట్రిక్ హాస్టల్‌లో 160 మంది డిగ్రీ, పీజీ విద్యార్థిను లున్నారు. ఇప్పటి వరకు దుప్పట్లు అందజేయలేదని విద్యార్థినులు తెలిపారు.
సైదాబాద్ దోబీఘాట్ ప్రాంతంలోని గోషామహాల్ బీసీ బాలుర హాస్టల్‌లో రాత్రివేళల్లో చలిని తట్టుకోలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
వెంగళరావునగర్ డివిజన్ పరిధి జవహర్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు దుప్పట్లు, మ్యాట్‌లు, రగ్గులు అందజేశారు. అయితే స్వెటర్లు ఇంకా రాలేదని వారు తెలిపారు.
రాజేంద్రనగర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో 114 మంది విద్యార్థులున్నారు. వీరికి ఇటీవలే దుప్పట్లు పంపిణీ చేశారు. అయితే హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లకు తలుపులు సరిగా లేవు.
బాటసింగారంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో రెండు నెలల క్రితమే దుప్పట్లు, బెడ్ షీట్, కార్పెట్లను పంపిణీ చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
మూడేళ్లుగా దుప్పట్లు లేవు
మూసారాంబాగ్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం అంబర్‌పేట-2లో విద్యార్థులకు రెండు మూడేళ్లుగా దుప్పట్లను పంపిణీ చేయడం లేదు. వారం రోజులుగా పెరిగిన చలితో విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు.
కూరెళ్ల మహే్‌షకుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్
దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్నాం
చలితీవ్రతను తట్టుకునే దుప్పట్లు లేకపోవడంతో రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నిద్రలేచిన తర్వాత చదువుకునే సమయంలోనూ చలిగా ఉంటోంది. అధికారులు వెంటనే స్పందించి ప్రతీ విద్యార్థికి దుప్పట్లు అందించాలి.
రవితేజ, బీటెక్ విద్యార్థి, గోషామహాల్ బీసీ హాస్టల్
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాట్ల వేలం.. రూ.55కోట్ల ఆదాయం
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు....16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News