ఆ విషయంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు అవార్డులు ఇవ్వాలి: ఎంపీ అర్వింద్ సెటైర్
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:32 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, జులై 28: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో విజయవంతమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంలో విఫలమవడం వల్ల, తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తుపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా వందలాది కళాశాలలు కూడా మూసివేతకి సిద్ధంగా ఉన్నాయని ఎంపీ అన్నారు. కాంగ్రెస్‌కు ముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి రుణభార ప్రాజెక్టులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుమ్మరించిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కే-కుటుంబం అపారమైన సంపదను కూడబెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు జెన్ జెడ్‌కు మద్దతుగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని ఎంపీ అన్నారు. దాదాపు 13 ఏళ్లుగా ఉద్యోగాల క్యాలెండర్‌ను నిలిపివేసినందుకు రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు అవార్డులు ఇవ్వాలంటూ సెటైర్ విసిరారు. తెలంగాణకు ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ, స్వచ్ఛమైన పాలన ఉన్న ప్రభుత్వం కావాలన్నారు. అందుకే తెలంగాణ.. బీజేపీకి సిద్ధంగా ఉందని గట్టిగా నమ్ముతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ
విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News