ధరణి అక్రమాలు భూభారతిలోనూ కొనసాగింపు?
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:15 AM
భూ రికార్డుల తారుమారు వ్యవహారం ధరణితోనే ఆగలేదని, భూభారతి పోర్టల్‌లోనూ ఇదే తరహా అక్రమాలకు ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలపై సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 19(ఆంధ్రజ్యోతి): భూ రికార్డుల తారుమారు వ్యవహారం ధరణితోనే ఆగలేదని, భూభారతి పోర్టల్‌లోనూ ఇదే తరహా అక్రమాలకు ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలపై సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ధరణి పోర్టల్ అక్రమాలు, ఫోరెన్సిక్ అడిట్‌లో గుర్తించిన 22 వేల అనుమానాస్పద లావాదేవీలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ అడిట్ తర్వాత రెవిన్యూ అధికారులు అప్రమత్తమై అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రాంతాల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి ఆధారంగా పలు సీఐడీ బృందాలు దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. కొల్లూరులో బయటపడిన రూ.90 కోట్ల భూమార్పిడితో భూభారతి పోర్టల్‌పై సందేహాలకు తావిచ్చిన క్రమంలో... అసలేం జరిగిందనే విషయాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే కొందర్ని అరెస్టు చేసి కీలక సమాచారం సేకరించారు.
ఆర్డీఓ అనుమతి లేకుండా మ్యుటేషన్ జరిగే అవకాశం లేనప్పటికీ.. కొల్లూరు కేసులో ఆర్డీఓకు తెలియకుండానే మ్యుటేషన్ జరగడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మరికొన్ని మ్యుటేషన్ల వివరాలను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆపరేటర్ల లాగిన్ దుర్వినియోగం కావడం, రాత్రి వేళ పక్కా పథకంతో లాగిన్ అయిన తర్వాతే భూ రికార్డుల మార్పులు జరిగాయన్న విషయాలను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని మార్పులకు తెరతీయడంతో పాటు భూదాన్ భూములకు బై నంబర్లు వేసి యాజమాన్య హక్కులు సృష్టించినట్లు వారు గుర్తించినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ నిర్వహించిన కంపెనీల కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు పూర్తి చేసిన సీఐడీ కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News