Share News

ప్రచార ఆర్భాటాలు చేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు: డిప్యూటీ సీఎం భట్టి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:51 AM

మూసీ ప్రాజెక్ట్‌‌కు సంబంధించి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలని కోరుకుంటున్నారా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ప్రచార ఆర్భాటాలు చేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు: డిప్యూటీ సీఎం భట్టి
Telangana Assembly

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ శాసనసభలో(Telangana Assembly) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మూసీ ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పందించారు. మురికి కూపంలో జీవిస్తున్న ప్రజల జీవన స్థితి గతులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. సామాజిక బాధ్యతతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. ‘అక్కడి ప్రజల జీవితాలు మారొద్దని మీరు కోరుకుంటున్నారా. మూసీ అభివృద్ధి జరగవద్దని మీరు చెబుతున్నారా. ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలని కోరుకుంటున్నారా? మురికి కూపంలో ఉండేవారు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారా. సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. మీలాగా ప్రచార ఆర్భాటాలు చేసి వదిలేసే ప్రభుత్వం కాదు మాది’ అంటూ కేటీఆర్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


ఆ జీవోనే అమలు చేస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బీఏసీలో చెప్పిన విషయాన్ని వారి సభ్యులకు కూడా చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఒక ప్రశ్నపైనే సభా సమయాన్ని వృధా చేయొద్దన్నారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్‌ను యుద్ధ ప్రాతిపదికన తాము సిద్ధం చేయలేదని తెలిపారు. 2024 డిసెంబర్‌లో డీపీఆర్ తయారీ కోసం మెయిన్ హార్ట్‌ కంపెనీకి బాధ్యత అప్పగించామన్నారు. ఫిబ్రవరి 2026లో డీపీఆర్ సిద్ధమైందని చెప్పారు. 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని 2016లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని.. ఆ జీవోనే తాము అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే బోర్డ్ మీటింగ్‌లో ఏడీబీ నుంచి అప్రూవల్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆ సంస్థ ఇవ్వకపోతే మరో సంస్థ ఇస్తుందన్నారు. మెయిన్ హార్ట్ కంపెనీ అనేక పనులు చేసిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఏ పనినీ తాము ఆపలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.


మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్

మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏ ప్రశ్నకు కూడా మంత్రి సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ని దశల్లో అభివృద్ధి జరుగుతుందో చెప్పలేదన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని.. తాము ఆందోళన చేస్తున్నామని అన్నారు. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. సర్కార్‌‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 12:09 PM