పంట కోతలను వాయిదా వేసుకోవాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:03 AM
మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంటల కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు.
తుఫాను ప్రభావం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులకు వ్యవసాయ మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంటల కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు వారిని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి తుమ్మల ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సీజన్‌లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధిక నీటి అవసరం ఉన్న పంటల విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాగా, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రిటైర్డ్ మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సీహెచ్ నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయ గాథను రైతులతో పంచుకున్నారు. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయల సాగుతో పాటు పాడి పశువులు, నాటుకోళ్లు, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. బయో రిసోర్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రి అందిస్తున్నామని వివరించారు. నవీన్ కుమార్‌ను మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News