Share News

ట్రాఫిక్‌ కష్టాలకు ‘సైబరాబాద్‌ మూవ్స్‌’తో చెక్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:08 AM

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)లో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించి ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

ట్రాఫిక్‌ కష్టాలకు ‘సైబరాబాద్‌ మూవ్స్‌’తో చెక్‌

  • సైబరాబాద్‌లో ప్రజారవాణాను ప్రోత్సహించటంపై 3 రోజుల కార్యక్రమం

  • నేడు టీ-హబ్‌లో ప్రారంభించనున్న డీజీపీ ఆనంద్‌

  • ప్రజలకు సురక్షిత రవాణాను అందించటమే లక్ష్యం

  • సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌ వెల్లడి

హైదరాబాద్‌/ సిటీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)లో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించి ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సీఎంసీటట, సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా ‘సైబరాబాద్‌ మూవ్స్‌’ పేరుతో మూడు రోజుల ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 28వ తేదీ వరకు రాయదుర్గంలోని టీ-హబ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు తదుపరి రోజుల్లో కార్యక్రమంలో పాల్గొంటారు. లండన్‌ ప్రజా రవాణా వ్యవస్థలో సాంకేతికత, డేటా విభాగాలకు నాయకత్వం వహిస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ శశివర్మ ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయనున్నారు. కొలంబియాలోని బగోటా నగర మేయర్‌ కూడా హాజరుకానున్నారు. సైబరాబాద్‌ మూవ్స్‌ అనేది ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రజారవాణాను ప్రొత్సాహించి నగర ప్రయాణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గల అవకాశాలను అణ్వేషించే అంతర్జాతీయ చర్చా కార్యక్రమం. ఇందులో ట్రాఫిక్‌ రద్దీ తగ్గింపు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు పెంచడం, కార్‌ పూలింగ్‌, వన్‌వే రోడ్లు, సైక్లింగ్‌, రోడ్డు భద్రత అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.


కార్యక్రమం జరిగే మూడు రోజులు సీఎంసీలో ప్రజల్లో స్వచ్ఛందంగా కార్‌ పూలింగ్‌, షేర్డ్‌ మొబిలిటీ పెంచాలని ఇప్పటికే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌ పిలుపునిచ్చారు. అదే సమయంలో సీసీ కెమెరాలు, వెహికల్‌ కౌంటింగ్‌ యంత్రాల ద్వారా వాహనాల రద్దీని పరిశీలించనున్నారు. ఈ మూడు రోజుల్లో ట్రాఫిక్‌ రద్దీలో వచ్చే మార్పులను గత డేటాతో విశ్లేషిస్తారు. సైబరాబాద్‌ మూవ్స్‌ లక్ష్యాలపై 400లకు పైగా విద్యా సంస్థల్లో 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. సీఎంసీ కమిషనర్‌ సృజనతో కలిసి సీపీ రమేష్‌ బుధవారం ఈ కార్యక్రమం గురించి మీడియాకు వివరించారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లకు ఆయన బుధవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా సైబరాబాద్‌ మూవ్స్‌ గురించి వెల్లడించారు.


సురక్షితమైన ప్రజా రవాణాయే లక్ష్యం: సీపీ రమేష్‌

సీఎంసీలో ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందుబాటులోకి తేవటమే సైబరాబాద్‌ మూవ్స్‌ లక్ష్యమని సీపీ రమేష్‌ తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రతరం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏటా ఆర్టీసీ ద్వారా వెయ్యి బస్సుల చొప్పున ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. సీఎంసీ, సైబరాబాద్‌ పోలీసులు, హెచ్‌ఎండీఏ, మెట్రోరైలు, ఆర్టీసీ ఇతర విభాగాల అధికారులు ఈ కార్యక్రమంపై గత రెండునెలలుగా కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలోతొలిసారి ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


లండన్‌లో 90 శాతం మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారని.. అక్కడి అధికారుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుని సైబరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా రవాణా పెరిగితే ట్రాఫిక్‌ రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు. మూడురోజుల కార్యక్రమంలో వివిధ అంశాలపై ప్రత్యేక చర్చలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా రవాణా, ట్రాఫిక్‌ నిర్వహణ, కాలుష్య నియంత్రణపై నిపుణుల సూచనలు తీసుకుంటామని చెప్పారు. సైబరాబాద్‌ మూవ్స్‌లో ఇప్పటివరకు 1,172 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, 174 మంది వాలంటీర్లుగా పాల్గొంటారని వివరించారు. విద్యార్థుల నుంచి 280 వినూత్నమైన ఆలోచనలు వచ్చాయని, సదస్సులో ఎంపికచేసే ఆలోచనలకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రజలు, విద్యార్థులు నగర రవాణా సమస్యల పరిష్కారానికి తమ సూచనలు అందించవచ్చని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:10 AM