Share News

చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:33 PM

చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్
CP Sajjanar

హైదరాబాద్, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును పరిశీలించారు. సీపీతో పాటు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేప మందు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో నాంపల్లి మెట్రో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి.


నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భక్తుల కోసం చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా వైద్య, అగ్నిమాపక శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. చేప ప్రసాదం కోసం వచ్చిన వారి కోసం 3 హెల్త్ క్యాంప్‌లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్సులను సిద్ధం చేశారు. అస్వస్థతకు గురైన వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. అవసరమైతే ఉస్మానియా ఆస్పత్రికి తరలింపుకు ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బందితో హెల్త్ టీమ్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండనుంది. భద్రతా చర్యల్లో భాగంగా 3 ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. భారీ జనసందోహం నేపథ్యంలో ప్రత్యేక అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను అధికారులు కల్పించారు.


నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున లక్షకు పైగా చేప పిల్లల ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే దాదాపు 50 వేల మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈరోజు(సోమవారం) సాయంత్రం 7 గంటల నుంచే క్యూలైన్లలో ఉండనున్నారు. రాత్రి 9 గంటల 1 నిమిషానికి చేపమందు పంపిణీ ప్రారంభంకానుంది.శుభ ముహూర్తం ప్రకారమే చేపమందు పంపిణీని నిర్వాహకులు ప్రారంభించనున్నారు. ఉబ్బసం, ఆస్తమా బాధితులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లతో అధికారులు సిద్ధమయ్యారు. చేపమందు పంపిణీ నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు విధించారు.


ఇవి కూడా చదవండి..

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు

ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 12:40 PM