బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 07 , 2026 | 03:16 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని.. అప్పులు పాలు చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునని ఆయన విమర్శించారు. పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, జూన్07: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని.. అప్పులు పాలు చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునని ఆయన విమర్శించారు. పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. ఆదివారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి ఆర్థిక పరిస్థితి.. మీరు గద్దె దిగిపోయే నాటికి ఉన్న పరిస్థితిపై విదేశాల్లో ప్రసంగించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 25 ఏళ్ల పాలన కాదు.. వచ్చే రెండున్నరేళ్లు మీ పార్టీని కాపాడుకోవాలంటూ కేటీఆర్‌కు సూచించారు. తెలంగాణలో మీ పార్టీ అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు ప్రజలు సంకేతాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ఫెయిల్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించారన్నారు. అయినా బుద్ధి రావడం లేదంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారు.. మున్సిపల్ ఎన్నికల్లో మీ మోహం మీద ప్రజలు ఛీ కొట్టారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వం కావాలని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారన్నారు. నగదు, మద్యంతో ఏమైనా చేస్తామన్న అహంకారంతో దేశాలు తిరిగి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. మీరెన్ని దేశాలు తిరిగినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ 80కి పైగా స్థానాలు గెలుచుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. దమ్ముంటే.. మీకు చేతనైతే దీనిని ఆపాలంటూ కేటీఆర్‌కు చొప్పదంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతోపాటు తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేశారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణ ప్రజలను వానపాముల్లా చూశారని.. కానీ అవే వానపాములు బుసలు కొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేశాయన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని ఈ సందర్భంగా అభివర్ణించారు. వారు ఆకలినైనా భరిస్తారు కానీ.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికీ క్షమించరన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల కూడా దొరకరని వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని అభివర్ణించారు.
రాష్ట్రంలో చెబుతున్నవి సరిపోలేదని మలేషియా వెళ్లి అబద్దాలు చెపుతున్నారంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కానీ.. కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అలాంటి మీరు.. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై మండిపడ్డారు. మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 80కి పైగా సీట్లతో మరో సారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను చూసి తెలంగాణ ప్రజలు ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. విదేశాల్లో ప్రసంగాలు చేసేముందు పదేళ్లు మీరు చేసిన దోపిడి, అకృత్యాలు, నియంత పాలనపై ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ అగ్రనేతలను ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రసంగాలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ తమ జిల్లాకు చెందిన వారన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను అందుకే పరామర్శించినట్లు చొప్పదంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత
లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే పుల్లారావు
For More TG News And Telugu News