Share News

డీఎస్పీల నియామకాల్లో పారదర్శకత పాటించాం: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 10 , 2026 | 07:56 PM

భవిష్యత్తు నిర్ణయించే వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లితే నియామకాల పట్ల అపనమ్మకం ఏర్పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బి. వెంకటేశంను నియమించామని తెలిపారు.

డీఎస్పీల నియామకాల్లో పారదర్శకత పాటించాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 10: భవిష్యత్తు నిర్ణయించే వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లితే నియామకాల పట్ల అపనమ్మకం ఏర్పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బి. వెంకటేశంను నియమించామని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారి చైర్మన్‌గా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్లిష్టమైన పరిస్థితుల్లో డీఎస్పీల నియామకం చేపట్టామని వివరించారు. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈ ప్రభుత్వమే పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2011లో గ్రూప్-1 నియామకాలు చేపట్టారని.. ఆ తర్వాత 2025 వరకు దాదాపు 13 ఏళ్లు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదని గుర్తు చేశారు. కొన్ని నెలలు ఆలస్యమైతేనే ఏళ్లు కోల్పోయామనే బాధ కలుగుతుందని అన్నారు.


టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రశ్నాపత్రాలు, ఇతర అంశాల్లో జరిగిన గందరగోళం అందరికీ తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు ఆ రోజు బాధితులు.. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిర్లక్ష్యం చాలా మందికి కష్టనష్టాలు మిగిల్చిందని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించానని గుర్తు చేసుకున్నారు. గతంలో టీజీపీఎస్సీలో సభ్యులుగా పనిచేసిన వారిలో ఆర్‌ఎంపీ డాక్టర్లు లాంటి వాళ్లు కూడా ఉన్నారని వివరించారు.


రాజకీయ పునరావాస కేంద్రంగా టీజీపీఎస్సీ తయారైందని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అవగాహన లేని వాళ్లను సభ్యులుగా నియమించడమే ప్రభుత్వం చేసిన తప్పు అని పేర్కొన్నారు. యూపీఎస్సీ చేపట్టిన విధి విధానాలను అధ్యయనం చేసి టీజీపీఎస్సీని ఆ తరహాలో రూపొందించామని అన్నారు. అందుకోసం యూపీఎస్సీకి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. టీజీపీఎస్సీ మొదటి చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించామని వివరించారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో అనుభవం కలిగిన వాళ్లను, చిత్తశుద్ధి ఉన్నవాళ్లను బోర్డు సభ్యులుగా నియమించామని సోదాహరణగా వివరించారు.


563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది జాయిన్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 112 మంది డీఎస్పీల నియామకం చాలా పెద్ద విషయమని అన్నారు. నియామకాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకత పాటించిందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉన్నారంటే తమ ప్రభుత్వ పారదర్శకత అర్థమవుతుందని తెలిపారు. ఈ నియామకాలపై కొందరు పని గట్టుకుని ఎన్నో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అయితే తమకు రాజకీయ ఆరోపణలు కొత్త కాదని.. కానీ మీకు ఇది చాలా ఆందోళన కలిగించిందని చెప్పారు. ఈ అవకాశం కూడా జారిపోతుందేమోనని ఆందోళన చెందారని అన్నారు. డీఎస్పీల తరఫున సుప్రీంకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిందని వివరించారు. నిష్ణాతులైన న్యాయవాదులతో వాదించి డీఎస్పీల నియామకాన్ని సాధించామని గుర్తు చేశారు.


నాలెడ్జ్, చిత్తశుద్ధి, అంకితభావం మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ నేపథ్యాన్ని మరిచిపోవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు ఆయన హితవు పలికారు. మన నేపథ్యాన్ని మరిచిపోతే మన హోదాకు న్యాయం చేయలేమన్నారు. మీరు ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరిచిపోవద్దని స్పష్టం చేశారు. లక్ష్యం పెట్టుకుని కష్టపడ్డారు కాబట్టే ఈ హోదాకు చేరుకున్నారని శిక్షణ డీఎస్పీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ముందు రెండో అధ్యాయం ప్రారంభం కాబోతుంది.. ఇది మీ జీవితాల్లో చాలా ముఖ్యమని తెలిపారు. వచ్చే ముప్పై ఏళ్లు తెలంగాణ భవిష్యత్తును ఏ దిశగా నడిపించాలో అది మీ చేతుల్లోనే ఉందని వారికి సీఎం రేవంత్ సూచించారు.


ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే పెద్ద హోదా మీదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఫీడ్‌ బ్యాక్, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారుతుందని చెప్పారు. మీరు నిటారుగా నిలబడి డ్యూటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. నిజాయితీగా డ్యూటీ చేయాలి.. బాధ్యతను గుర్తించి పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థలేనని గుర్తు చేశారు.


డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్‌ను తీసుకువచ్చి అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్, డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్‌ల కోసం సరికొత్త వ్యవస్థలను తీసుకువచ్చామని వివరించారు. అవసరమైతే నూతన డీఎస్పీలను అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. తమ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 08:17 PM