అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక దసరా: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:52 PM
చెడుపై మంచి సాధించిన గెలుపు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్19: చెడుపై మంచి సాధించిన గెలుపు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు.
మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ పండుగ సందేశమిస్తోందని వివరించారు.
ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాల పూలు పూయించాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై విజయం సాధించిన అమ్మవారి శక్తిని, శ్రీరాముడు రావణాసురుడిపై సాధించిన విజయాన్ని ఈ పర్వదినం మనకు గుర్తు చేస్తుందని అన్నారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని గుర్తు చేశారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని చాటి చెబుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌నినోపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
For More TG News And Telugu News