దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:03 AM
దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానుంది. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఈ డేటాసెంటర్ ఏర్పాటుకు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ ‘హైపవర్ వాల్ట్’తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
264 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు
రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7వేల మందికి ఉద్యోగాలు
టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్‌తో ఒప్పందం
పొరుగు రాష్ట్రాలతో కాదు.. జపాన్, సింగపూర్ వంటి దేశాలతోనే తెలంగాణకు పోటీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానుంది. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఈ డేటాసెంటర్ ఏర్పాటుకు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ ‘హైపవర్ వాల్ట్’తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హైపవర్ వాల్ట్ ప్రతినిధులు, సీఎస్ సంజయ్ జాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు రావడం చరిత్రాత్మకమని.. దీంతో భారత్ ఫ్యూచర్ సిటీ వెలిగిపోతుందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను కలిసినప్పుడు.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిందిగా తాను కోరానని సీఎం గుర్తు చేసుకున్నారు. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని.. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దేన్ని అధిగమించినా బ్లూకాలర్ జాబ్‌లను మాత్రం భర్తీ చేయలేదని.. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారికి ఉపాధి అవకాశాలు బలంగా ఉంటాయని.. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా బ్లూకాలర్ జాబ్‌లను సృష్టించడమే లక్ష్యంగా చేసుకుంటున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారగానే పాలసీలు మారుతాయని.. కానీ, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా పాలసీల్లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘ఎక్స్’లో కూడా సీఎం దీనిపై ఒక పోస్టు పెట్టారు. ఈ డేటా సెంటర్ దేశంలోనే అతి పెద్ద క్యాంప్‌సగా మారనుందని.. రాష్ట్రాన్ని ఏఐ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇదో కీలక ఘట్టమని ఆనందం వెలిబుచ్చారు.
తెలంగాణ వైపు ఏఐ దిగ్గజాల చూపు: దుద్దిళ్ల
ప్రపంచంలోని ఏఐ దిగ్గజ సంస్థలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గత జనవరిలో దావోస్‌లో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో సీఎం భేటీతోనే.. ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా సంస్థ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్రంతో టాటాకు దీర్ఘకాలిక అనుబంధం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీసీఎస్ సీఈవో కృతివాసన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌సిటీలో 264 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్లో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ ఏఐ డేటా సెంటర్ క్యాంప్‌సను ఏర్పాటు చేయనున్నట్లు హైపవర్ వాల్ట్ సంస్థ వెల్లడించింది. దీన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించగా.. 2028 జూన్ 2న ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని సీఎం ఆదేశించారు. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంప్‌సను అభివృద్థి చేయనున్నారు. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
సిరిసిల్ల, సిద్దిపేటపై దండయాత్ర
Read Latest AP News And Telangana News And International News And Telugu News