ఎస్సెల్ గ్రూప్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రపై కేసు
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:02 PM
ఉన్న దానికంటే ఎక్కువ నెట్‌వర్త్ చూపించి రూ. 980 కోట్ల అప్పులను తీసుకున్నారనే ఆరోపణతో ఎస్సెల్ గ్రూప్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రూ.980 కోట్ల అప్పుల వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రపై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కాన్‌స్పిరసీ, ఫ్రాడ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంటి ఆరోపణలను ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. సుభాష్ చంద్ర ఈ భారీ అప్పులను ఎల్ఐసీ-హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్) నుంచి పొందారు. తప్పుడు నెట్‌వర్త్ (ఆస్తుల విలువ) చూపించి తమను మోసం చేశారని ఆ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
వసంత్ సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ రెండు కంపెనీలు ఎల్ఐసీ-హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.500 కోట్ల అప్పులు తీసుకున్నాయి. ఈ అప్పులకు 2018 మార్చిలో సుభాష్ హామీదారుడిగా సంతకం చేశారు. ఆ సమయంలో ఆయన తన నెట్‌వర్త్ వివరాలను 6,197.62 మిలియన్ డాలర్లుగా చూపించారు. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపుగా రూ.59 వేల కోట్లు ఉంటుంది. కొంతకాలం తరువాత డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేమెంట్ అనే మరో సంస్థ ఎల్ఐసీహెచ్ఎఫ్ఎఫ్ వద్ద నుంచి రూ.480 కోట్ల రుణాలు తీసుకుంది. దీనికి కూడా సుభాష్ హామీదారుడిగా ఉన్నారు. ఈ అప్పు తీసుకునే సమయంలో ఆయన నెట్‌వర్త్‌ను రూ. 40 వేల కోట్లుగా చూపించారు.
నా ఆస్తులు నిజంగా అంత లేవు
తన ఆస్తులు ముందు చెప్పినంత భారీగా లేవని సుభాష్ చంద్ర అంగీకరించినట్టు సమాచారం. 2024లో తన నెట్‌వర్త్ రూ. 31.79 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. అయితే నెట్‌వర్త్‌లో ఇంతలా వ్యత్యాసం ఎందుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోన్లు పొందడానికే నెట్‌వర్త్ ఎక్కువగా చూపించారా.. ? లేదా దీని వెనుక మరేదైనా కారణముందా..? అనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది. అలాగే లోన్‌గా తీసుకున్న రూ.980 కోట్ల రూపాయలను దేనికి వినియోగించారనే దానిపైనా దర్యాప్తు చేయనుంది. ఎఫ్ఐఆర్‌లో సుభాష్ చంద్రతో పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన వ్యక్తుల పేర్లూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ఈడీ ఆరోపణలపై విచారణ.. పంజాబ్ న్యాయవాదికి ఊరట