Share News

పుణె హత్య కేసులో మరో అరెస్ట్.. కేతన్ హత్య కుట్రలో చేతన్ స్నేహితుడి పాత్ర ఏంటి..

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:51 PM

మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద నమోదైన కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేతన్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పటికే అరెస్టు అయ్యారు.

పుణె హత్య కేసులో మరో అరెస్ట్.. కేతన్ హత్య కుట్రలో చేతన్ స్నేహితుడి పాత్ర ఏంటి..
Pune fort murder case

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద నమోదైన కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేతన్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పటికే అరెస్టు అయ్యారు. తాజాగా ఈ కేసులో మూడో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతన్ చౌదరి స్నేహితుడు 22 ఏళ్ల రితేశ్ హంగేను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు (Pune fort murder).


కేతన్‌ను హత్య చేయాలన్న కుట్ర గురించి రితేశ్‌కు ముందే తెలుసని, హత్య ప్రణాళికలో అతడికి కూడా పాత్ర ఉందని ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. హత్య కుట్రలో రితేశ్ ప్రమేయంపై మరింత సమగ్రంగా విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. సియా, చేతన్ తొలుత కేతన్ చేతులు, కాళ్లు విరిచి అతడిని గాయపరిచి ఆ తర్వాత హత్య చేయాలన్న ఆలోచన చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రణాళిక గురించి కూడా రితేశ్‌కు తెలుసని అధికారులు తెలిపారు (Ketan Agarwal murder).


హత్య జరిగిన తర్వాత కూడా రితేశ్‌కు చేతన్ ఫోన్ చేసి విషయం చెప్పినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అందులో కేతన్‌ను లోహగఢ్ కోట నుంచి ఎలా తోసేయాలి, హత్య తర్వాత ఆధారాలను ఎలా తొలగించాలి అనే అంశాలపై రితేశ్, చేతన్ మధ్య ఛాటింగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన రితేశ్‌ను పోలీసులు పుణెలోని వడ్గావ్ మావల్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని సెప్టెంబర్ 12 వరకు పోలీసుల అదుపులో ఉంచేందుకు అనుమతించింది (Lohagad Fort murder).


కేతన్ హత్య కుట్రలో రితేశ్‌ పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పుణెకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న తన కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లాడు. అక్కడ కొండ అంచు నుంచి కింద ఉన్న లోయలో పడిపోయి కేతన్ మృతి చెందాడు. ఈ హత్య వెనుక సియా, చేతన్‌లు ఉన్నారని బయటపడడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తాజాగా రితేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..


9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..

Updated Date - Sep 05 , 2026 | 08:54 PM