ఫాంహౌస్‌లోనే కుట్ర.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పారు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:04 AM
శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆధ్వర్యంలో పన్నిన కుట్రలో భాగంగానే.. బీఆర్‌ఎస్ సభ్యులు అధికారులపై దాడులు చేయడంతోపాటు శాసనసభ స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానపరిచారని తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పిన కేసీఆర్
ఉన్మాదంతో వ్యవహరించిన బీఆర్‌ఎస్ సభ్యులు
కుల, జాతి వివక్షతో అశాంతి సృష్టించాలనుకున్నారు
సభాపతి మనసును గాయపరచడమే వారి లక్ష్యం
దళితులు తిరిగిన నేలను శుద్ధి చేస్తారా?
ఖర్గే విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు
ఫాంహౌస్ కుట్రలపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నాం
జాయింట్ కమిషనర్ విజయ్‌కుమార్‌కు బాధ్యతలు
కుట్రదారులు, పాత్రధారులకు శిక్షలు తప్పవు
ఆ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి
కాంగ్రెస్ పార్టీ అంటేనే కోట్లాది ప్రజలకు భరోసా
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆధ్వర్యంలో పన్నిన కుట్రలో భాగంగానే.. బీఆర్‌ఎస్ సభ్యులు అధికారులపై దాడులు చేయడంతోపాటు శాసనసభ స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానపరిచారని తెలిపారు. సభాపతికి జరిగిన అవమానంపై డప్పు దరువు ద్వారా నిరసన తెలిపేందుకు వెళ్లిన దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులపైనా దాడులు చేశారని మండిపడ్డారు. పైగా, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేసి.. తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే పథకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోందన్నారు. ఈ అన్ని ఘటనలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయకుమార్‌కు అప్పగిస్తున్నామని చెప్పారు. బుధవారం స్పీకర్‌పై బీఆర్‌ఎస్ సభ్యుల దూషణలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో కోట్లాది మంది ప్రజలకు, తాడిత, పీడిత వర్గాలకు ఒక విశ్వాసం, భరోసా అని అన్నారు. వివిధ సమూహాల కలయిక అయిన భారతదేశంలో దళితులు, మహిళలు, ఆదివాసీల గౌరవాన్ని నిలబెట్టేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మనదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందని అడిగేవారు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో పరిస్థితులను ఒకసారి పరిశీలించాలని సీఎం రేవంత్ అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ దూరదృష్టితో ఎలాంటి చర్యలు తీసుకుందో వారికి అర్థమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఆ రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రపతి వరకు అవకాశం దక్కిందన్నారు. కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో జన్మించి.. రజాకార్ల దాడుల్లో తండ్రిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా రాణించి, జాతీయ స్థాయికి ఎదిగిన నేత మల్లికార్జున ఖర్గే 60 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. 85 ఏళ్ల వయసులోనూ ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై పోరాడుతున్న ఖర్గే.. ఉత్తరాఖండ్‌లో ఒక నిరసన సభలో పాల్గొంటే.. బీజేపీ అనుబంధ సంస్థ అయిన శ్రీరామ్‌సేన సభ్యులు ఆ మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం అత్యంత హేయమైన చర్య అని రేవంత్ మండిపడ్డారు. దీనిని శాసనసభ ముక్తకంఠంతో ఖండిస్తోందని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశమంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఎంపీలు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనను మరువక ముందే రాష్ట్రంలో మరో దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు.
సభ నడవకుండా బీఆర్‌ఎస్ కుట్ర..
విద్యా రంగంలో సమస్యలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలనుకున్నామని, ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలపై చర్చించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ అన్నారు. కానీ, ఇవేవీ జరగకుండా బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుంటే.. 6వ తేదీ సాయంత్రం ఆ పార్టీ సభ్యులను కేసీఆర్ తన ఫాంహౌస్‌కు పిలిపించుకొని.. సభ జరగకుండా చేసేలా పథకం పన్నారని తెలిపారు. వారి సభ్యులను ఉన్మాదులుగా మార్చి.. సభను అడ్డుకునేందుకు ఉసిగొల్పారని చెప్పారు. సమస్యలపై చర్చ జరిగితే వారి పదేళ్ల దురాగతాలు, అప్పులపై ప్రజలకు అవగాహన కలుగుతుందని భయపడ్డారని, అదే జరిగితే తెలంగాణ ప్రజలు ఇక శాశ్వతంగా వారి పార్టీని బొందపెడతారనే చర్చ జరగకుండా కుట్ర చేశారని ధ్వజమెత్తారు. పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన వారికి పెద్దగా తేడా లేదన్నారు. ఉన్మాదానికి లోనై కొంతమంది నేతలు.. అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతిని అవమానించేలా వ్యవహరించారని, ఆయన తల్లిని సైతం అవమానించారని మండిపడ్డారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చునని, కానీ.. వ్యక్తపరచడంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తించారని తెలిపారు. దీనిపై విపక్ష నేత కేసీఆర్ సభాపతికి క్షమాపణచెప్పి.. వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి.. సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారని, కానీ.. అలా జరగకపోగా వారు మరింత ఉన్మాదంతో వ్యవహరించారని విమర్శించారు.
దళితులు నిరసన తెలపడం నేరమా?
కుట్ర జరిగిన ఫాంహౌస్ ముందే దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారని సీఎం రేవంత్ తెలిపారు. వారిలా ఉన్మాదానికి తెగబడలేదని, కేవలం డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారని చెప్పారు. తమను బానిసలుగా భావించవద్దని, సహనం కోల్పోయేలా వ్యవహరించవద్దని చెప్పేందుకే దళిత సోదరులు వెళ్లారన్నారు. చెప్పులు కుట్టిన చేతులు రాజ్యాంగ పదవులను చేపట్టాయని, ఇంకా తమ మనసులను గాయపరచవద్దని దరువేసి మరీ చెప్పారన్నారు. ఇది నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్.. బాధలో ఉన్నవారి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాల్సిందని, ఆ ప్రతినిధులను లోపలికి పిలిచి మాట్లాడి ఉండాల్సిందని అన్నారు. కానీ, ఆయన అలా వ్యవహరించకుండా మళ్లీ ఉన్మాదంతో వ్యవహరించారని తెలిపారు. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలంటూ ఆదేశించి తీవ్రంగా అవమానించారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే అక్కడ శుద్ధి చేశామంటూ సంధ్యారావు అనే బీఆర్‌ఎస్ నాయకురాలు స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని చెప్పారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?రాతియుగంలోని రాక్షసుల్లా వ్యవహరిస్తున్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు.
సమాజంలో అశాంతి సృష్టించాలనుకున్నారు..
సమాజంలో జాతి, కుల వివక్ష తీసుకొచ్చి.. అశాంతిని ప్రోత్సహించి.. రెండు జాతుల మధ్య వైరంగా మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇందుకు ఆ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. అప్పుడే ఈ వివక్ష ఫలితం ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందన్నారు. అధికార మదంతో కొల్లగొట్టిన ఆస్తులతో, ఆధిపత్యం చెలాయించాలనేది వారి ఆలోచన అని ఆరోపించారు. దళితుడు అడుగుపెడితే నేల మైలపడుతుందని కేసీఆర్ అవమానిస్తే.. ఈ సమాజమే మైల పడుతుందన్నారు. దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే మన కడుపులు నిండుతున్నాయన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని, కేసీఆర్ కుటుంబంలో పాతుకుపోయిన అహంకారాన్ని, అంటరానితనం ఆలోచనల్ని అని చెప్పారు. కేసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని శుద్ధి చేసే బాధ్యతను తెలంగాణ సమాజం తీసుకుంటుందన్నారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించేలా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోందని, జరిగిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెబితే కిరీటం ఊడి పడుతుందా? అని ప్రశ్నించారు. ఇంకా కొంతమంది మనసుల్లో పేరుకుపోయిన మనువాద భావాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం విచారణ చేపట్టి ఎంతటివారినైనా శిక్షించాలని నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. కుట్రలు పన్నినవారితోపాటు కుట్రలో భాగస్వాములైన వారినీ చట్టపరిధిలోశిక్షించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
అన్ని ఘటనలపైనా దర్యాప్తు..
ఈ నెల 6న జరిగిన కుట్ర నుంచి ఆ తర్వాత జరిగిన వరుస ఘటనలను క్రోడీకరించి.. సమగ్ర విచారణ జరిపి, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. సభాపతి మానసిక ధైర్యం కోల్పోవద్దని, ఆయన మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు, మహిళా పోలీసులతో అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది బెయిల్ పొందవచ్చునని, కానీ.. తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News