Share News

సింగరేణికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:21 PM

తెలంగాణ సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

సింగరేణికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Union Minister Kishan Reddy

న్యూఢిల్లీ, జులై 7: దేశాభివృద్ధి విషయంలో సహకార సమాఖ్య విధానంతో అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్(SCCL) అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. 39 వర్కింగ్ మైన్స్‌లో 21 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయని.. సుమారు 6 నుంచి 8 జిల్లాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయని అన్నారు. లక్షలాది ప్రజల గుండెచప్పుడు సింగరేణి అని వెల్లడించారు.


సింగరేణికి సంబంధించిన మేజర్ మైనింగ్ ప్రాజెక్టుల ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింగరేణి కార్మికులు భాగస్వాములయ్యారని తెలిపారు. కార్మికుల ధైర్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. ఒడిశాలో నైనీ కోల్‌ బ్లాక్ సింగరేణికి వచ్చేలా కృషి చేసినట్లు తెలిపారు. సింగరేణి పురోగతికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు గనుల వేలంలో పాల్గొనేలా సింగరేణి ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌లో సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్నాయన్నారు. 30 నుంచి 35 సంవత్సరాలకు సరిపోయే బొగ్గు ఉందని తెలిపారు. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం సింగరేణికి లభించిందని.. దీని వల్ల సింగరేణికి సుమారు రూ.75 వేల కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందన్నారు.


సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు గనులు కేటాయించామని కిషన్ రెడ్డి తెలిపారు. తాడిచర్ల-2 బొగ్గు గనులపై తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్న ఈ బ్లాక్ ద్వారా.. ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల పాటు ఈ గని నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా మొత్తంగా రూ.64,000 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నేరుగా సింగరేణికి ఈ గని ఇవ్వడం ద్వారా ఆక్షన్ ప్రీమియం చెల్లింపు లేని కారణంగా ఆ సంస్థకు కనీసం రూ.2,550 కోట్లు మిగులుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీ సహా వివిధ మార్గాల్లో దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు: రాంచందర్‌రావు

హైదరాబాద్‌లో దారుణం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 04:50 PM