ఆ గుండెజబ్బు గుట్టు వీడింది
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:31 AM
గుండె కండరాలను గట్టి పడేటట్లు చేసి రక్తప్రసరణను అడ్డుకునే ‘హైపర్‌ట్రోఫిక్ కార్డియో మయోపతి’ అనే గుండెజబ్బుకు రెండు జన్యు రూపాంతరాలు కారణమవుతున్నాయని సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు.
‘హైపర్‌ట్రోఫిక్ కార్డియో మయోపతి’కి
కారణాలను గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు
160 మంది పేషంట్లపై సీసీఎంబీ అధ్యయనం
హైదరాబాద్ సిటీ, నవంబరు 5: గుండె కండరాలను గట్టి పడేటట్లు చేసి రక్తప్రసరణను అడ్డుకునే ‘హైపర్‌ట్రోఫిక్ కార్డియో మయోపతి’ అనే గుండెజబ్బుకు రెండు జన్యు రూపాంతరాలు కారణమవుతున్నాయని సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. ఎంవైహెచ్7 అనే జన్యువులో ఇవి ఉన్న ట్లు కనుగొన్నారు. సీసీఎంబీకి చెందిన డాక్టర్ దీపా సెల్విరాణి సారథ్యంలో జరిగిన ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ: ఆసియా’లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా పరిశోధకుల బృందం 160 మంది హైపర్ ట్రోఫిక్ కార్డి యో మయోపతి బాధితులు, 178 మంది ఆరోగ్యవంతుల్లోని ఎంవైహెచ్7 జన్యువును పోల్చి చూశారు. మొత్తం 34 జన్యు రూపాంతరాలను గుర్తించగా వాటిలో రెండు (పీ.మెట్684ఏఆర్‌జీ, పీ.ఎల్‌ఈయూ725పీఆర్‌ఓ) మయోపతికి కారణమవుతున్నట్లు తేలింది.
52 ఏళ్ల వయసున్న ఓ మహిళలో పీ.మెట్684ఏఆర్‌జీ వల్ల గుండె కండరాలు గణనీయంగా గట్టిపడ్డాయని గుర్తించారు. 26 ఏళ్ల వయసున్న ఆమె కుమారుడిలోనూ ఈ జన్యు రూపాంతరం ఉందని, అతడి గుండె కండరాలు కూడా గట్టిపడే దశలో ఉన్నాయని వెల్లడైంది. పీ.ఎల్‌ఈయూ725పీఆర్‌ఓ ఉన్న ఓ 58 ఏళ్ల పురుషుడిలో, అతడి కుమార్తె (24)లోనూ సరి గ్గా ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ మాట్లాడుతూ.. పీ.మెట్684ఏఆర్‌జీ, పీ.ఎల్‌ఈయూ725పీఆర్‌ఓ జన్యు రూపాంతరాలు ‘హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతి’ బాధితుల్లోనే ఉన్నాయని, ఆరోగ్యవంతుల్లో లేవన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన ప్రజల్లోనూ ఇవి కనిపించటం లేదని, భారతీయ లేదా దక్షిణాసియా ప్రజల్లోనే ఇవి ఆవిర్భవించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.
ఈ జన్యు రూపాంతరాలు అరుదైనవని, ఎక్కువ మందిలో లేవని తెలిపారు. తమ పరిశోధన ద్వారా.. హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతిని తొలిదశలోనే గుర్తించి, చికిత్స అందించటానికి వీలవుతుందని చెప్పారు. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ.. గుండెజబ్బులకు జన్యువులు ఎలా కారణమవుతున్నాయన్న అంశాన్ని అధ్యయనం చేయటంలో ఈ పరిశోధన తోడ్పడుతుందన్నారు. సదరు జన్యు రూపాంతరాలను గుర్తించి చికిత్సను అందించటం ద్వారా.. భవిష్యత్ తరాలను ఈ తరహా గుండెజబ్బులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ పరిశోధనలో ఉస్మానియా వర్సిటీకి చెందిన డాక్టర్ ప్రతిభ నల్లారి, ఏఐజీ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ కలంబుర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News