Share News

రియల్‌ ఎస్టేట్‌ దాహానికి చరిత్ర గురుతు మాయం

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:11 AM

మూసీ నదిపై వందల ఏళ్ల క్రితం నిర్మించిన వరదనీటి డైవర్షన్‌ కాలువ బుల్కాపూర్‌ నాలా దాదాపుగా అదృశ్యమై పోయింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనూ స్పష్టంగా కనిపించిన ఈ నాలా గత పుష్కరకాలంలో ఆక్రమణలతో చిక్కిపోయి అక్కడక్కడా ఆనవాళ్లు కూడా లేకుండా అదృశ్యం అయిపోయింది.

రియల్‌ ఎస్టేట్‌ దాహానికి చరిత్ర గురుతు మాయం
Balapur Nala

  • బుల్కాపూర్‌ నాలా పూడ్చి రోడ్లు, వెంచర్లు.. వందల ఏళ్ల నాటి వరద కాలువ 12 ఏళ్లలో మాయం

  • బుల్కాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు అదే పరిస్థితి

  • కళ్లు మూసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ యంత్రాంగం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిపై వందల ఏళ్ల క్రితం నిర్మించిన వరదనీటి డైవర్షన్‌ కాలువ బుల్కాపూర్‌ నాలా దాదాపుగా అదృశ్యమై పోయింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనూ స్పష్టంగా కనిపించిన ఈ నాలా గత పుష్కరకాలంలో ఆక్రమణలతో చిక్కిపోయి అక్కడక్కడా ఆనవాళ్లు కూడా లేకుండా అదృశ్యం అయిపోయింది. సర్కారు స్థలమేగా అనుకున్న రియల్టర్లు అధికారులను జేబులో వేసుకొని రెవెన్యూ రికార్డుల ప్రకారం 33 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాను అటూ ఇటూ ఆక్రమించి ఉందా లేదా అన్నట్లు చేశారు. లేఅవుట్లు చేయడంలో ఎక్కడ నాలా అడ్డం వస్తే అక్కడ పైపులు వేసేసి రోడ్లు వేసేశారు. దాంతో అది కొన్నిచోట్ల చిన్న మురుగు కాలువగా, కొన్నిచోట్ల ఆనవాలు లేకుండా తయారైంది. తాజాగా జన్వాడ ప్రాంతంలోని బుల్కాపూర్‌ నాలా పాయపైనా ఇంత విధ్వంసం జరుగుతున్నా అధికార యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుని కూర్చుంది. ఓపెన్‌ నాలాపై కాజ్‌వే కట్టాలంటే రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అనుమతి తప్పనిసరి. అవేవీ లేకుండానే నాలా మీద రోడ్లు వేస్తున్నారు. జన్వాడలోని బుల్కాపూర్‌ నాలా పొడవునా ఎక్కడ చూసినా అక్రమణలే. వందల కొద్దీ లారీలతో మట్టి, బండరాళ్లు తెచ్చి నింపి రోడ్లు పోసుకుంటున్నారు. జీవో 111 పరిధిలో అక్రమ లేఅవుట్లతో అరాచకానికి ప్రభుత్వానికి చెందిన సహజ నీటి వనరుల విధ్వంసం తోడయ్యింది.


అప్రోచ్‌ రోడ్డుగా నాలా

ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉన్న జన్వాడలో భూములు 111 పరిధిలో ఉన్నా ఎకరా రూ.20 కోట్లు పలుకుతున్నాయి. దీంతో తమ భూముల ఎలివేషన్‌ కోసం బుల్కాపూర్‌ నాలాను ఎంత విధ్వంసం చేయడానికైనా రియల్టర్లు భయపడటం లేదు. నాలా వెడల్పు ఎక్కువగా ఉంటే సదరు భూములకు విలువ తక్కువ. అందుకే, లెక్కలో చూపడానికి కాకపోయినా బుల్కాపూర్‌ నాలాను ఇష్టం వచ్చినట్లు పూడ్చేశారు. కబ్జా చేసి తమ భూముల్లో కలుపుకున్నారు. కొన్నిచోట్ల నాలాను మూసేస్తూ కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టారు. నాలా పొడవునా రోడ్లను నిర్మిస్తూ వెంచర్‌లకు అప్రోచ్‌ రోడ్లుగా మార్చుకుంటున్నారు. గతంలో వందల క్యూసెక్కుల నీటిని తరలించిన కాలువను పూడ్చివేసి, చిన్నచిన్న సిమెంట్‌ పైపులు, ఇరుకైన బాక్స్‌ డ్రైయిన్లు వేసి పైన రోడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మిస్తున్నారు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు అయి నాలా విస్తీర్ణానికి కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. నాలా బఫర్‌ జోన్లను, శిఖం భూములను ప్రైవేట్‌ సర్వే నంబర్లలో కలిపేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం

నాలా పరిరక్షణపై సాగునీటి శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. నాలా ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతున్నా, బఫర్‌ జోన్లలో నిర్మాణాలు జరుగుతున్నా తన సరిహద్దులు గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. రెవెన్యూ అధికారుల తీరు మరింత నిర్లక్ష్యంగా ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నంబర్ల వారీగా రికార్డులను, నాలా విస్తీర్ణాన్ని సరి చూడకుండానే ఎన్‌ఓసీలు, నిర్మాణ అనుమతులకు అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. పట్టా భూమి పక్కనే ఉన్న నాలాను కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నాలా ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌), బఫర్‌ జోన్లను ఉల్లంఘిస్తూ వెలుస్తున్న భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా వస్తున్నాయన్నది మిస్టరీగా మారింది. నిజాం కాలం నాటి రెవెన్యూ మ్యాపులను(టిప్పన్లు/కాడాస్ట్రల్‌ మ్యాప్స్‌) ఆధారంగా చేసుకుని శంకర్‌పల్లి నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు డ్రోన్ల సాయంతో డిజిటల్‌ సర్వే నిర్వహించి బుల్కాపూర్‌ నాలా హద్దులు నిర్ణయించాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు. నాలా బఫర్‌ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని, ఆక్రమణలకు పాల్పడిన రియల్టర్లతో పాటు సహకరించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండు చేస్తున్నారు.


ఇంజనీరింగ్‌ అద్భుతం

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌ వద్ద ప్రారంభమయ్యే మూసీ నది వరద డైవర్షన్‌ కాలువ ఖానాపూర్‌, కోకాపేట, నార్సింగి, పుప్పాల్‌గూడ, మణికొండ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ చివరకు హుస్సేన్‌సాగర్‌లో కలిసేది. మార్గమధ్యంలో ఈ నాలా అనేక చెరువులను నింపుకుంటూ దాదాపు 30 కిలోమీటర్లకు పైగా ప్రవహించేది. ఈ కాలువ జీర్ణావస్థకు చేరడమే 1908 నాటి మూసీ వరదలకు ఒక కారణమని తేల్చారు. అందుకే, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు బుల్కాపూర్‌ వరద నీటి డైవర్షన్‌ కాలువను ఆధునికీకరించి పటిష్ఠం చేశారు. ఆ తర్వాతే అదనపు రక్షణగా గండిపేట చెరువును నిర్మించారు. నిజానికి బుల్కాపూర్‌ నాలా మూలాలు కుతుబ్‌షాహీల పాలనలో ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నాలా ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌తో కనుమరుగవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతం

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:12 AM