Share News

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:23 AM

‘‘విద్యా శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. ఆర్థిక వెసులుబాటు మేరకు మీ సమస్యలన్నీ మీరు అడగకుండానే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి
Revanth Reddy

  • టీచర్ల అన్ని సమస్యలు పరిష్కరిస్తా

  • టీచర్లే నా గుంపు.. విద్యా మంత్రిగా గుంపు మేస్త్రీనే..

  • మీరు పిల్లల భవిష్యత్తు చూడండి..

  • మీ ఉద్యోగ భద్రత నేను చూస్తా

  • కొడంగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం రేవంత్‌

వికారాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘విద్యా శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. ఆర్థిక వెసులుబాటు మేరకు మీ సమస్యలన్నీ మీరు అడగకుండానే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని, తల్లిదండ్రుల కంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని పేర్కొన్నారు. విద్యార్థులభవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ అమూల్యమైన సమయం కేటాయిస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులని ఆయన ప్రశంసించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైఏర్పాటు చేసిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి.. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.కేశవరావు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను.. విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీదేవసేన, మంచిర్యాల కలెక్టర్‌ దీపక్‌ కుమార్‌, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రమే్‌షలను శాలువాలు, మెడల్‌, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వారితో గ్రూప్‌ ఫొటో దిగారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు టీచర్లేనని, అలాంటి టీచర్లు రోడ్డెక్కినా, వీధుల్లోకి వచ్చినా ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తామంటే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వనని, రెండు సంవత్సరాలు సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తానని, వారికి చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘ఆ మధ్య ఎప్పుడో నేను గుంపు మేస్త్రీని అన్నాను. ఇందుకు ఒకాయన నన్ను ఎక్కిరించాడు. అయితే, ఇక్కడున్న టీచర్లే నా గుంపు. విద్యాశాఖ మంత్రిగా ఈ గుంపునకు నేను మేస్త్రీని. నా కుటుంబం మీరే. మీలాంటి టీచర్లే నాకు ఒకప్పుడు చదువు చెప్పారు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘రెండేళ్ల తర్వాత.. మీరు ఆశించినట్లుగా మీ సమస్యలను పరిష్కరించకుంటే.. ఎన్నికల పరీక్షల్లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోండి’’ అని సూచించారు. ‘‘ప్రభుత్వ సర్వీసులో మీరు 30 -35ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకూ ఒకసారి మీ ముందుకు వచ్చి పరీక్ష రాస్తే, ఆ పేపర్‌ దిద్దాల్సిందేనని మీరే’’అని చమత్కరించారు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే దిక్సూచిలా తీర్చిదిద్దుకునేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.


విధ్వంసం నుంచి..

గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం, విధ్వంసం చేశారని.. ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులపైనే ఉందని సీఎం అన్నారు. విద్యా రంగంలో జాతీయ సగటులో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ 17వ స్థానానికి ఎదగడం ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమైందన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 88 వేల మంది విద్యార్థులు చేరారంటే ఆ గొప్పదనం ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే ఎప్పుడు పరీక్షలు జరిగేవో, నియామకాలు ఎప్పుడు చేసేవారో తెలిసేది కాదని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ నుంచి నియామకాల వరకు పూర్తి చేశామని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించామని గుర్తుచేశారు. 25,950 మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించింది నిజం కాదా? చిన్న వివాదం లేకుండా 34,706 మంది ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘‘మీ వైపు నుంచి నేను ఆశించేది ఒక్కటే. చిత్తశుద్ధితో, అంకితభావంతో రెండు సంవత్సరాలు పని చేయండి. 2028 డిసెంబరులో ఎన్నికలుండొచ్చు. లేదంటే 2029 మార్చి, ఏప్రిల్‌లోనైనా ఎలక్షన్‌ ఉండొచ్చు’’ అని సీఎం పేర్కొన్నారు.


కలిసికట్టుగా పనిచేద్దాం...

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను నియమించి ఎడ్యుకేషన్‌ పాలసీని తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని.. ఉపాధ్యాయుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కృషి చేస్తున్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వ విధానంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతిక విద్యలో భాగంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలను ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తే.. ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ప్రైవేటీకరణా చేయట్లేదని.. టీచర్లు, లెక్చరర్స్‌ ఉద్యోగాలకు ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్‌ కాలేజీలు ఇప్పటి వరకు డిప్లొమాలే జారీ చేస్తున్నాయని, విదేశాల్లో మాస్టర్స్‌ చదువుకోవడానికి వీలుగా డిగ్రీ పట్టాను అందించే విధంగా మార్పులు చేశామని.. పాలిటెక్నిక్‌ చదువుకున్న వాళ్లు డైరెక్ట్‌గా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో చేరిపోవచ్చని వివరించారు. హైదరాబాద్‌కు చెందినవారు రాకెట్‌ తయారుచేసి ఎలాన్‌ మస్క్‌కే సవాల్‌ విసురుతున్నారంటూ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ గురించి ప్రస్తావించారు.


అనుమానాలుంటే..

లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ఢోకా ఉండదని.. సర్వీసు రూల్స్‌ వేరు, విద్యా విధానం వేరని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో కూర్చొని మాట్లాడాలని సూచించారు. ‘‘సంఘాల నాయకులకు నా సూచన ఒక్కటే. ప్రభుత్వం మీకు డోర్లు తెరిచే ఉంచింది ఏ సమస్య ఉన్నా నిస్సందేహంగా మీరు ప్రభుత్వం దగ్గరికి రండి సమస్యల్ని చర్చించండి .పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. మీ ఉద్యోగ భద్రత మీ జీతభత్యాలు, పీఆర్సీల భద్రత నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోండి’’ అని సూచించారు. కాగా.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయని, ఉపాధ్యాయుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.


50 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల కొడంగల్‌ పర్యటన విజయవంతమైంది. నియోజకవర్గంలోని మద్దూర్‌, దౌల్తాబాద్‌, దుద్యాల్‌, కొడంగల్‌లో పర్యటించిన ఆయన.. రూ.50 కోట్లకుపైగా నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సీఎం శనివారం ప్రారంభించారు. వీటిలో.. కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో రూ.27 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌, రూ.8.51 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, అరబిందో ఫార్మా సీఎ్‌సఆర్‌ నిధులు రూ.8 కోట్లతో నిర్మించిన జడ్పీ బాలికొన్నత పాఠశాల భవనాలు, రూ.2 కోట్లకు పైగా నిధులతో నిర్మించిన ప్రభుత్వ స్విమ్మింగ్‌ పూల్‌ వంటివి ఉన్నాయి. అలాగే.. కోస్గిలో రూ.4 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కొడంగల్‌ నుంచే ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక.. ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్‌ను కూడా సీఎం ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ హరేరామ, హరేకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, రూ.5కే భోజనం అందించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీ భార్య కుటుంబం అంతానికి కుట్ర పన్నిన.. యూకే ఫార్మసిస్టుకు షాక్‌!

సర్‌లో కాంగ్రెస్‌ ఓట్లు తొలగించే కుట్ర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 05:26 AM