Share News

మాజీ భార్య కుటుంబం అంతానికి కుట్ర పన్నిన.. యూకే ఫార్మసిస్టుకు షాక్‌!

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:04 AM

మియాపూర్‌లో మూడేళ్ల క్రితం జరిగిన విష ప్రయోగం కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ భార్య కుటుంబాన్ని అంతమొందించేందుకు విష ప్రయోగం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకేకు చెందిన అజిత్‌ కుమార్‌ ముప్పారపు (46) అనే ఫార్మసిస్టును భారత్‌కు అప్పగించేందుకు లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిరేస్టట్స్‌ కోర్టు అనుమతి ఇచ్చింది.

మాజీ భార్య కుటుంబం అంతానికి కుట్ర పన్నిన.. యూకే ఫార్మసిస్టుకు షాక్‌!
crime

  • 2023నాటి కేసులో అజిత్‌ను భారత్‌కు అప్పగించేందుకు లండన్‌ కోర్టు ఓకే

  • మాజీ భార్య కుటుంబంపై అజిత్‌

  • విష ప్రయోగం చేశాడని ఆరోపణలు

  • అత్త మరణంతో వెలుగులోకి ఘటన

  • మామ హత్యకు పలు ప్రయత్నాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): మియాపూర్‌లో మూడేళ్ల క్రితం జరిగిన విష ప్రయోగం కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ భార్య కుటుంబాన్ని అంతమొందించేందుకు విష ప్రయోగం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకేకు చెందిన అజిత్‌ కుమార్‌ ముప్పారపు (46) అనే ఫార్మసిస్టును భారత్‌కు అప్పగించేందుకు లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిరేస్టట్స్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. భారత సంతతికి చెందిన యూకే పౌరుడైన అజిత్‌ కుమార్‌ నుంచి విడాకులు కోరుతూ అతని భార్య శిరీష 2023లో కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత శిరీష కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ వివాహం కోసం ఒక్కచోటుకు చేరారు. శిరీష కుటుంబం హత్యకు పథకం పన్నిన అజిత్‌ కుమార్‌.. ఇంట్లో ఉపయోగించే కారం, ఉప్పులో ఆర్సెనిక్‌ కలిపాడని, ఆ ఉప్పుకారాలతో వండిన ఆహారం తిని శిరీష కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారని ప్రధాన ఆరోపణ. ఆ ఆహారం తిని అస్వస్థతకు గురైన శిరీష తల్లి ఉమామహేశ్వరి 2023 జూలై 5న మరణించారు. వైద్యపరీక్షల్లో ఆమె శరీరంలో సాధారణ స్థాయికంటే భారీగా ఆర్సెనిక్‌ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. దీంతో విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి. శిరీష తండ్రి హనుమంతరావు హత్యకు అజిత్‌ పలుమార్లు ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి. హనుమంతరావును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అజిత్‌ కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, శరీరంలోని కండరాల పనితీరును స్తంభింపజేసే మందును ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చి హత్య చేసేందుకు అజిత్‌ పథకం రచించాడనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే, అజిత్‌ బ్రిటన్‌ పౌరసత్వం తీసుకోవడంతో అతడ్ని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన కేసుల్లో విచారణకు అప్పగించాలని కోరుతూ ఇంటర్‌పోల్‌ ద్వారా కేసును అధికారులు ముందుకు తీసుకెళ్లారు. అజిత్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలను ఆధారాలను భారత అధికారులు లండన్‌ కోర్టుకు వివరించారు. మరోపక్క, విషప్రయోగంతో తనకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు లేవని అజిత్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. భారత్‌కు అప్పగిస్తే తన భద్రతకు ముప్పు ఉంటుందన్న వాదననూ ముందుకు తెచ్చారు. అయితే భారత అధికారులు సమర్పించిన ఆధారాలు, అతడి భద్రతకు ఇచ్చిన హామీలను పరిశీలించిన కోర్టు అజిత్‌ను భారత్‌కు అప్పగించేందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు కీలక దశకు చేరుకుంది. అయితే లండన్‌ కోర్టు తీర్పుపై అజిత్‌ అక్కడి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉండటంతో అతడిని వెంటనే హైదరాబాద్‌కు తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ నెలలోనే పునర్‌వ్యవస్థీకరణ!

సర్‌లో కాంగ్రెస్‌ ఓట్లు తొలగించే కుట్ర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 05:41 AM