ఈ నెలలోనే పునర్‌వ్యవస్థీకరణ!
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:47 AM
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ ఈ నెలాఖరులోపే ఉండనుంది. ఈ నెల నాలుగోవారంలోనే మంత్రి వర్గంలో మూడు ఖాళీలను భర్తీ చేయడంతోపాటు శాఖల్లో మార్పులు-చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
3 ఖాళీల భర్తీ... శాఖల్లోనూ మార్పులు
మంత్రి వర్గంలోకి మహేశ్ గౌడ్
రేసులో స్పీకర్ ప్రసాద్, కోదండరాం, సుదర్శన్‌రెడ్డి
బాలు, రామచంద్రనాయక్‌లో ఒకరికి..
రేసులో విజయశాంతి, పద్మావతీరెడ్డి
పీసీసీ చీఫ్‌గా పొన్నం లేదా బలరాం?
అసెంబ్లీ సమావేశాల తర్వాత కసరత్తు
మహేశ్ స్థానంలో పొన్నం లేదా బలరాం
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ ఈ నెలాఖరులోపే ఉండనుంది. ఈ నెల నాలుగోవారంలోనే మంత్రి వర్గంలో మూడు ఖాళీలను భర్తీ చేయడంతోపాటు శాఖల్లో మార్పులు-చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సారి టీపీసీసీ అధక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన రెండేళ్ల పదవీ కాలం ఈ నెల 15తో ముగియనుంది. ఇదే కారణం కాకున్నా గతం నుంచీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. మహేశ్‌గౌడ్ తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశంపైనా అధిష్ఠానం దృష్టి పెట్టనుంది. పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు పరిశీలనలో ఉంది. ఒకవేళ లంబాడా వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌కూ అవకాశం దక్కొచ్చు. రెండేళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడి నియామక సమయంలోనూ చివరి వరకూ ఆయన రేసులో ఉన్నారు. మరోవైపు.. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలోనే మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నించారు. సమీకరణాలు కుదరకపోవడంతో అప్పట్లో స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఈ రేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించినా...వీలు కాలేదు. అయితే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఒకే జిల్లాకు చెందిన వారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తారా? అనే చర్చ నడుస్తుండగా.. ఖమ్మం జిల్లాలో ముగ్గురికి, నల్లగొండ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి కదా.. అన్న ప్రస్తావన వస్తోంది. మంత్రి వర్గం రేసులో ఎమ్మెల్సీ విజయశాంతి పేరూ పరిశీలనలో ఉంది. గతంలో నేరుగా అధిష్ఠానంతో మాట్లాడుకొని ఆమె ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోగా, ఈ సారి ఆమె ప్రయత్నాలు ఏమవుతాయన్నది కొన్ని వారాల్లో తేలనుంది. కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాలంటే విజయశాంతికి పదవి దక్కే అవకాశాలున్నాయి. అలాగే, మహిళా కోటాలో నలమాద పద్మావతీరెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే అడుగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వర్గంలో ఉన్నందున.. వీరి విషయంలో అధిష్ఠానం ఏం ఆలోచిస్తుందనేది వేచి చూడాల్సిందే. ఇక, లంబాడా వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావిస్తే విప్ రామచంద్రనాయక్, ప్యానల్ స్పీకర్ బాలునాయక్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఒకవేళ పీసీసీ చీఫ్‌గా బలరాం నాయక్‌కు అవకాశం వస్తే మంత్రివర్గంలో ఆ వర్గానికి అవకాశం ఉండక పోవచ్చు. మరోవైపు, మంత్రివర్గం నుంచి ఒకరిని తొలగించే అవకాశాలూ ఉన్నాయన్న సమాచారంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు సైతం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించనున్న అధిష్ఠానం.. ఆయన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనుంది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌నూ ఢిల్లీకి పిలవనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో
సర్‌లో కాంగ్రెస్ ఓట్లు తొలగించే కుట్ర!
Read Latest AP News And Telangana News And International News And Telugu News