Share News

30శాతం కమీషన్‌ సర్కార్‌ ఇది

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:35 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం... ‘30 శాతం కమీషన్‌ సర్కార్‌’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితా(22ఏ)లోని భూములను తొలగిస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 30 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

30శాతం కమీషన్‌ సర్కార్‌ ఇది
BJP

  • కాంగ్రెస్‌పై రాంచందర్‌రావు ధ్వజం

  • 22ఏపై హైకోర్టు జడ్జితో విచారణకు డిమాండ్‌

  • రాష్ట్రాన్ని ‘ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ’గా మార్చేసిన కాంగ్రెస్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు: ఏలేటి

  • సోనియా, రాహుల్‌కు రాష్ట్రం నుంచి నెలకు 400 కోట్లు: ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌/కవాడిగూడ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం... ‘30 శాతం కమీషన్‌ సర్కార్‌’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితా(22ఏ)లోని భూములను తొలగిస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 30 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వెనక ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ శనివారం ధర్నా చౌక్‌ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ 22ఏ అక్రమాలపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేడు ప్రజాపీడనగా మారిందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ‘రేవంత్‌ రెడ్డి-రాహుల్‌గాంధీ (ఆర్‌ఆర్‌) రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ’గా మార్చేశారన్నారు. 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్‌ సెటిల్మెంట్లతో దోచుకున్న మొత్తాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కప్పం కడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు, అధికారులు చేస్తున్న ప్రతి అక్రమం లక్షలాది బీజేపీ కార్యకర్తల సెల్‌ ఫోన్లలో సేవ్‌ అవుతోందని, 2029లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పైసా లెక్క తేలుస్తామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను 22ఏలో పెట్టి దోచుకుంటున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 22ఏ జాబితా నుంచి ఆస్తిని లేదా భూమిని తొలగించాలంటే 50 శాతం వాటా అడుగుతున్నారన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని కంజర గ్రామం మొత్తాన్ని 22ఏలో పెట్టారని, ఆ గ్రామస్థులు మహాధర్నాకు వచ్చారని తెలిపారు. రాహుల్‌, సోనియా గాంధీలకు సీఎం రేవంత్‌ రెడ్డి నెలకు400 కోట్లు పంపిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. పుప్పాలగూడలో 17 వేల కోట్ల విలువైన 134 ఎకరాల భూమిని మార్చేశారని, ఆ భూములు కొన్నవారిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఐపీఎస్‌, ఐఎఎస్‌ అధికారులు ‘ఎస్‌ బాస్‌’ అని పనిచేస్తే రాబోయే రోజుల్లో జైలు పాలవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఒకర్ని మించి మరొకరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. 22ఏను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ సర్కారు తరహాలోనే భూ దోపిడీకి పాల్పడుతోందని ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. రైతులను, ఉపాధ్యాయులు, విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చినందుకు వెయ్యి రోజుల పాలన సంబరాలు జరుపుకుంటున్నారా అని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిని తొలగించినట్లే ప్రజల భూములను కూడా తొలగించాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. 22ఏ సమస్యతో నష్టపోయిన ఒక బాధిత రైతు నిమ్మరసం అందించి మహేశ్వర్‌ రెడ్డితో దీక్ష విరమింపజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీ భార్య కుటుంబం అంతానికి కుట్ర పన్నిన.. యూకే ఫార్మసిస్టుకు షాక్‌!

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 05:35 AM