BRS: బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం... అసెంబ్లీ బహిష్కరణ
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:13 PM
అసెంబ్లీని గాంధీ భవన్‌లాగా, సీఎల్పీ మీటింగ్‌లాగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక స్ట్రీట్ రౌడీనా అని విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, జనవరి 2: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని బీఆర్‌ఎస్ (BRS) నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మీడియాకు తెలియజేశారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. స్పీకర్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
బీఏసీ మీటింగ్‌కు ప్రభుత్వం తరపున గంటన్నర లేటుగా వచ్చారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వరా అని ప్రశ్నించారు. పార్లమెంటులో మోదీని రాహుల్ గాంధీ తిట్టడంలేదా అని నిలదీశారు. అసెంబ్లీలో తాను సీఎం గురించి మాట్లాడితే తప్పు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లాగా, సీఎల్పీ మీటింగ్‌లాగా మార్చారంటూ వ్యాఖ్యలు చేశారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక స్ట్రీట్ రౌడీనా అని అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, నీళ్ల ద్రోహి అని.. కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ప్రతి దానికి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత
Read Latest Telangana News And Telugu News