Road Accident: తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:09 PM
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనం నడపడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈరోజు (శుక్రవారం) రాష్ట్రంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మాదాపూర్‌లో కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
మద్యం మత్తులో..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డి పౌల్ట్రీఫార్మ్ దగ్గర ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తవుటి శ్రీకాంత్, సంగెం గిరి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే మహేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకుల మృతితో పోరండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కారును ఢీకొన్న బైక్...
మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దంపతులు మృతి
మూసారంబాగ్‌లో బస్సు ఢీకొని దంపతులు మృతి చెందారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని ఓవర్ టేక్ చేస్తూ ఢీకొట్టింది. దీంతో బస్సు వెనక చక్రాల కింద పడి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిరుపతయ్య, వెంకటరమణమ్మగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
కేసీఆర్, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News