Share News

ఓట్‌ చోర్‌, సంవిధాన్‌ చోర్‌.. కాంగ్రెస్సే

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:13 AM

ఓట్‌ చోర్‌, సంవిధాన్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసిన చరిత్ర ఆ పార్టీదని ధ్వజమెత్తారు.

ఓట్‌ చోర్‌, సంవిధాన్‌ చోర్‌.. కాంగ్రెస్సే
Ramchander Rao

  • భారత్‌ సమ్మిట్‌కు దేశ వ్యతిరేక శక్తుల్ని తెచ్చారు

  • రాహుల్‌ క్షమాపణ చె ప్పాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఓట్‌ చోర్‌, సంవిధాన్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసిన చరిత్ర ఆ పార్టీదని ధ్వజమెత్తారు. భారత్‌ సమ్మిట్‌కు జార్జ్‌ సోరోస్‌ నిధులు ఇచ్చారని, వాటితో దేశ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చారని ఆరోపించారు. సమ్మిట్‌లో పాల్గొని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిపై బీజేపీ తెలంగాణ తరఫున ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ బీజేపీ అన్ని అనుబంధ శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ రాహుల్‌గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు ఎక్కువ మద్దతు లభించినా.. నెహ్రూ ప్రధాని కావడం మొదటి ఓటు చోరీ అని విమర్శించారు. 1969లో అధికారం కోసం ఇందిరా గాంధీ కాంగ్రెస్‌ పార్టీని చీల్చారని, 1975లో ఎమర్జెన్సీ విధించి లక్షలాది మందిని జైళ్లలో పెట్టి రాజ్యాంగాన్ని కాలరాశారని గుర్తు చేశారు. భారత్‌ సమ్మిట్‌లో ఒక ఇటలీ ప్రతినిధి ఓట్‌ చోర్‌...గద్దీ చోడ్‌ అంటూ వ్యాఖ్యలు చేయడం దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.


విదేశాలకు వెళ్లి భారత్‌ను డెడ్‌ ఎకానమీ అని విమర్శించిన రాహుల్‌గాంధీ... ఇప్పుడు విదేశీయులను భారత గడ్డపైకి పిలిపించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారని ధ్వజమెత్తారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లె లిగ్‌ సహా మరికొందరికి కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో వీసాలు రద్దు చేయడం సరైన చర్యేనని సమర్థించారు. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ప్యాట్రిక్‌ గాస్పర్డ్‌(ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ మాజీ అధ్యక్షుడు), గిలౌమ్‌ లాంగ్‌(ఈక్వెడార్‌ మాజీ విదేశాంగ మంత్రి), నికా కోవాచ్‌(స్లోవేనియా) బెర్ట్‌ కోయెండర్స్‌(డచ్‌ మాజీ విదేశాంగ మంత్రి), బెర్ట్‌ కోయెండర్స్‌ (డచ్‌ మాజీ విదేశాంగ మంత్రి) వంటి వారంతా జార్జ్‌ సోరోస్‌ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నవారేనని, అక్కడినుంచి నిధులు పొందిన వారేనని వివరించారు. భారతదేశంలో అశాంతి సృష్టించడమే వీరి లక్ష్యమని పేర్కొన్నారు.


కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ను వేగవంతం చేయాలని అన్ని విభాగాలకు రాంచందర్‌రావు సూచించారు. బీజేపీలో జాతీయ స్థాయిలో 22అనుబంధ విభాగాలున్నాయని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ విభాగాల పనితీరుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ ఇప్పుడున్న వాటికి అదనంగా మరో ఐదారు విభాగాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. మాజీ సైనికులు, న్యాయవాదులు, వ్యాపారులు, ఐటీ, సోషల్‌ మీడియా, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు, వైద్యులు, సాంస్కృతిక విభాగాల ద్వారా సమాజంలోని వృత్తి నిపుణలు, మేధావులను పార్టీతో అనుసంధానించి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:16 AM