Telangana Assembly: నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:34 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై బీజేపీ ఎమ్మెల్యేలు సభలో తమ గళం వినిపించారు.
హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) మూడో రోజు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kuamar) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, నిర్వాసిత రైతులకు పరిహారం, సాగునీటి సౌకర్యాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యేలు. చనాక కోరాట ప్రాజెక్ట్ నిర్వాసిత రైతుల సమస్యలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సభలో లేవనెత్తారు.
చనాక కోరాట ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు లక్షల రూపాయలే పరిహారం ఇస్తామన్నారని గుర్తుచేశారు. పదేళ్లు అయ్యిందన్నారు. నీళ్లు రాలేదని.. పరిహారం రాలేదని ఆదిలాబాద్ రైతులు పాదయాత్రగా హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వెంటనే భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
జైనాథ్‌పూర్ ప్రాజెక్టుపై సిర్పూర్ ఎమ్మెల్యే
జైనాథ్‌పూర్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని... ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రిని కలిసినా ఫైళ్లు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు మండలాల్లో సాగునీరు అందుతుందన్నారు. రైతులకు భారీ లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రాణహిత-చేవెళ్లను ప్రాజెక్ట్‌ను పూర్తి చేయండి: ముథోల్ ఎమ్మెల్యే
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. అలాగే ప్రిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
నిజాంసాగర్‌ను కాలువల ఆధునీకరణపై...
నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణకు రూ.2,000 కోట్లు కేటాయించాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు వేల కోట్లు విడుదల చేస్తేనే నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ సాధ్యమవుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, స్వరాష్ట్రంలోనూ నిజామాబాద్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా నీటిపారుదల శాఖ మంత్రి నవ్వుతూనే ఉన్నారని, కానీ సమస్యలపై స్పష్టమైన చర్యలు లేవని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత.
శ్రీనివాస కల్యాణంతో మహాసభలకు శ్రీకారం
Read Latest Telangana News And Telugu News