IndiGo Flight: గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:40 AM
గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ఇండిగో విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది తలెత్తింది.
కృష్ణా జిల్లా, జనవరి 3: గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ సింగపూర్ ఇండిగో విమానం (IndiGo Flight) గాల్లోనే చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు సమస్య ఎదురైంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానం దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చాలా సేపు విమానం గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు లైన్ క్లియర్ అవడంతో విమానాన్నిపైలట్ సురక్షితంగా రన్‌వై పైకి చేర్చారు. పొగమంచు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు, విమానయాన సిబ్బంది చెప్పుకొచ్చారు. అయితే.. చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆ ఫ్లైట్ సేఫ్‌గా రన్‌వేపై ల్యాండ్ అయ్యింది.
ఇక.. దట్టమైన పొగమంచు కారణంగా ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తుతోంది. ఈరోజు ఉదయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కప్పేసింది. దీంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ విమానం సైతం పొగమంచు కారణంగా అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం వేళలో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. పొంగమంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపై వాహనదారులు మరీ నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది. పొగమంచు కారణంగా అధిక వేగంతో వాహనాలు నడపి ప్రమాదాలబారిన పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రధాని, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోల ప్రసారం.. వ్యక్తి అరెస్ట్
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
Read Latest AP News And Telugu News