Bihar: ప్రధాని, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోల ప్రసారం.. వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:33 AM
ఇటీవల కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త రకం మోసాలకు తెగబడుతున్నారు. ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోలను ప్రసారం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి దేశం అంతా షాక్ అయ్యింది. ముజఫర్‌పూర్ జిల్లా భగవాన్‌పూర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ రాజ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్‌లను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేసి ప్రసారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోద్‌పై కేసు నమోదు చేసి.. శుక్రవారం అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రమోద్ కుమార్ సోషల్ మీడియాలో రాష్ట్రపతి, ప్రధానుల పేర్లు, ఫోటోలు, ఆడియో దుర్వినియోగం చేయడంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
‘దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, దేశంలోని అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాలకు సంబంధించిన గౌరవం, ప్రతిష్ఠ, నమ్మకాన్ని దెబ్బతీయడం, ప్రజాస్వామ్య సంస్థలపై అపనమ్మకాన్ని సృష్టించడం, సామాజిక సామరస్యం, శాంతి భద్రతలను ప్రభావితం చేసేలా ఏఐ వీడియోలు రూపొందించి ప్రసారం చేసినందుకు ప్రమోద్ కుమార్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. నకిలీ కంటెంట్ క్రియేట్ చేసి, ప్రసారం చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఫేక్ కంటెంట్ దేశ వ్యతిరేక భావాలను, పుకార్లను, సామాజిక అశాంతి వ్యాప్తి చేస్తాయని పోలీసులు చెబుతున్నారు, తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత
మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి