Shah Rukh Khan: షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:57 PM
బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని మీరా రాథోడ్ అన్నారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా తన నిరసనను తెలియజేశారు.
లక్నో: బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ (Shah Rukh Khan) తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టీమ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకోవడంపై దుమారం రేగుతోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఊచకోతలు చోటుచేసుకుంటున్న తరుణంలో షారూక్ చర్యను పలు హిందూ సంస్థల నేతలు తప్పుపడుతున్నారు. షారూక్‌ను 'ద్రోహి'గా పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేయగా, తాజాగా షారూక్ నాలుకు కత్తిరిస్తే రూ.లక్ష రివార్డు ఇస్తానని 'ఆల్ ఇండియా హిందూ మహాసభ' ఆగ్రా జిల్లా యూనిట్ అధ్యక్షురాలు మిరా రాథోడ్ (Meera Rathore) ప్రకటించారు.
బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని రాథోడ్ తెలిపారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా ఆమె తమ నిరసనను తెలియజేశారు.
షారూక్ తన ఐపీఎల్ టీమ్‌లో రెహమాన్‌ను తీసుకోవడాన్ని అయోధ్య సహా పలు ప్రాంతాలకు చెందిన సాధువులు సైతం ఖండించారు. షారూక్ హీరో కాదని, అతనికి క్యారెక్టర్ లేదని నాగపూర్‌లోని ప్రముఖ సాధువు స్వామి రామభద్రాచార్య మండిపడ్డారు. దేశ ప్రజలు ఆదరించడం వల్లే షారూక్‌కు ఇంత పేరు వచ్చిందని, ప్రజల మనోభావాలను ఆయన గౌరవించాలని ఆల్ ఇండియా అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి వ్యాఖ్యానించారు. మరో సాధువు దినేష్ ఫలహారి మహరాజ్ శుక్రవారంనాడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. షారూక్ ఆస్తులు స్వాధీనం చేసుకుని, ఆయనను బంగ్లాదేశ్‌కు పంపించేయాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ కూడా ఇదే తరహా డిమాండ్ చేశాడు. షారూక్ ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని, అతనికి ఈ దేశంలో నివసించే హక్కు లేదని అన్నారు. 'దేశంలో ద్రోహులకు కొదవలేదు. వాళ్లపై తగిన చర్చలు తీసుకోవాలి. లేకుంటే వాళ్లు దేశాన్ని ఇదేరకంగా అప్రతిష్టపాలు చేస్తూనే ఉంటారు' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు
ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి