PM Modi: నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:19 PM
స్పష్టమైన లక్ష్యం, దృఢచిత్తంతో ముందడుగు వేస్తూ ఈ ఏడాది ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్ఫూర్తివంతమైన సంస్కృత శ్లోకాలను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరంలో దేశ ప్రజలు దృఢచిత్తం, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో తమ లక్ష్యాలను చేరుకోవాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. ప్రజలు నూతన ఏడాదిలో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా ఆత్మశక్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా సంస్కృత శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. విజయం తథ్యమని, పట్టుదలతో ఎలాంటి సంకోచాలు లేకుండా, అప్రమత్తతతో సౌభాగ్య జీవన మార్గంలో ముందడుగు వేయాలనే శ్లోకాన్ని ఆయన షేర్ చేశారు. స్థిర చిత్తం, లక్ష్యంపై స్పష్టతే విజయానికి పునాదులు అని అన్నారు (PM Narendra Modi).
జీవిత లక్ష్యం ఏంటో తెలియజెప్పే మరో సంస్కృత స్లోకాన్ని కూడా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జ్ఞానం, సంపద, ధైర్యం, శక్తిసామర్థ్యాలు, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, నైపుణ్యాలు, మేధో సామర్థ్యాలు, సహనం, సహృదయత పెంపొందించుకోవడమే జీవిత లక్ష్యమని ఉపదేశించే పద్యాన్ని నెటిజన్లతో ప్రధాని షేర్ చేశారు. అటు భారతీయ అధ్యాత్మిక సంప్రదాయాన్ని, నేటి ఆధునిక ప్రపంచ లక్ష్యాలను మేళవిస్తూ స్ఫూర్తివంతంగా జీవితంలో ఎలా ముందడుగు వేయాలో వివరిస్తూ ప్రధాని ఈ శ్లోకాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇక దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని జనవరి 20న ప్రారంభించనున్నారు. తొలి రైలు కోల్‌కతా, గువాహటి మధ్య నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఇక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి సూరత్-బిలిమోరాల మధ్య తొలి సెక్షన్ 2027 ఆగస్టు 15 కల్లా అందుబాటులోకి వస్తుందని కూడా రైల్వే మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి
గాలి జనార్దన్ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదు