Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 02 , 2026 | 09:32 AM
బళ్లారిలో బ్యానర్ల కట్టే సమయంలో వివాదం రేగింది. ఈ కారణంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు, జనవరి 02: కర్ణాటక బళ్లారి నగరంలో బ్యానర్ల కట్టే విషయంలో ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భారత్ రెడ్డి వర్గానికి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాలి జనార్ధన రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా పది మందికిపై బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వీరితోపాటు మోత్కార్ శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, రాముడు, పలన్న, దివాకర్, మారుతి ప్రసాద్, దమ్మూర్ శేఖర్‌తోపాటు అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. పెట్టిన బ్యానర్లు తొలగించారని.. దుర్వినియోగం చేయడమే కాకుండా.. దౌర్జన్యానికి సైతం పాల్పడ్డారంటూ వారిపై కేసు నమోదు చేశారు. అలాగే గుంపులుగా రాళ్లు, కర్రలు, కొడవళ్లు, సోడా బాటిళ్లతో తమపై దాడికి వచ్చారని ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
జనవరి 3వ తేదీన బళ్లారిలోని ఎస్పీ సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరమంతా బ్యానర్లు కడుతున్నారు. ఆ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కట్టిస్తున్నాడు. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఇంతలో జనార్దన్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. దీంతో సతీష్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.
అలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడికి దిగింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. ఇంతలో వర్గాలను చెదరగొట్టేందుకు ఇద్దరు గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఒక గన్‌మెన్ వద్ద ఉన్న తుపాకీని సతీష్ రెడ్డి బలవంతంగా లాక్కొని జనార్దన్ రెడ్డిపైకి కాల్పులకు తెగబడ్డాడు. జనార్దన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. దీంతో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించినట్లు సమాచారం.
ఇక సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. బళ్లారి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి.. తనపై కాల్పులు జరిపిన బుల్లెట్‌ను మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనవసర రాద్దాంతం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వారికి భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి
For More National News And Telugu News