Dragon Boat Competitions: కోనసీమ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:41 AM
కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది. సంక్రాంతికి ముందే మూడు రోజులపాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో నిర్వహిస్తున్నారు.
ఆత్రేయపురంలో డ్రాగన్ పడవ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు
కయాకింగ్ బోటుపై ట్రయల్‌రన్ చేస్తుండగా తిరగబడిన బోటు
నీటిలోకి జారిపోయిన కలెక్టర్... లైఫ్ జాకెట్ ఉండడంతో తప్పిన ప్రమాదం
ఆత్రేయపురం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది. సంక్రాంతికి ముందే మూడు రోజులపాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో నిర్వహిస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజం శాఖ, స్థానిక కమిటీ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వివిధ రాష్ర్టాల నుంచి జల క్రీడాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం డ్రాగన్ పడవ పోటీల ట్రయల్ రన్‌ను ఆత్రేయపురం మండలం పులిదిండి-తాడిపూడి వరకూ ప్రధాన కాలువలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పడవలపై ట్రయల్ రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు తనకు ఎంతో ఇష్టమైన కయాకింగ్ బోటింగ్ చేశారు. ఆ సమయంలో బోటు తిరగబడింది. ఆయన నీటిలోకి జారిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కలెక్టర్ బోటును అనుసరిస్తున్న గజ ఈతగాళ్లు ఆయనకు సహకరించి మరో బోటులోకి ఎక్కించారు. కాసేపు ఉపశమనం పొందిన కలెక్టర్ యథావిధిగా డ్రాగన్ పడవపై ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా, ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కయాకింగ్ బోటింగ్ అదనపు ఆకర్షణ మాత్రమే. గతేడాది కూడా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ కయాకింగ్ బోటింగ్‌ను డ్రాగన్ పడవ పోటీల సమయంలో నిర్వహించారు. ఈ బోటింగ్ చేసేవాళ్లు ఇలా నీటిలో పడడం సర్వసాధారణమేనని, కలెక్టర్ స్విమ్మింగ్ క్రీడాకారుడు కావడంతో వెంటనే తేరుకుని మళ్లీ డ్రాగన్ పడవపై ట్రయల్ రన్‌లో పాల్గొన్నారని అధికార వర్గాలు తెలిపాయి.