GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:35 AM
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్నును 5 శాతానికి తగ్గించే అంశాన్ని జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశాల్లో పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాలి, నీటి నాణ్యత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీని తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో వాయు, నీటి నాణ్యత సమస్యలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్‌టీ రేటును తగ్గించే యోచనలో జీఎస్‌టీ మండలి ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని అత్యవసర వస్తువులుగా వర్గీకరించి జీఎస్‌టీ రేటును ప్రస్తుతమున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని తదుపరి సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. జీఎస్‌టీ కోతతో ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్ల ధరలు 10 నుంచి 15 శాతం మేర తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సామాన్య వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేకూర్చనుంది (GST Rate Cut on Air, Water Purifiers).
అయితే, తదుపరి జీఎస్‌టీమండలి (GST Council) సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్‌టీ మండలి చివరిసారిగా సమావేశమైంది. కానీ, ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్‌టీని యథాతథంగా కొనసాగించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మధ్య ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్యమని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు.
జీఎస్‌టీ మండలిపై ఇప్పటికే పన్ను తగ్గించాలన్న ఒత్తిడి ఉంది. ఢిల్లీలో వాయునాణ్యత అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్టీని తగ్గించాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వాయునాణ్యత మెరుగుపరచలేని పక్షంలో కనీసం ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్‌టీనైనా తగ్గించాలని అభిప్రాయపడింది. వీటిని కూడా వైద్యపరికరాల కేటగిరీలోకి చేర్చి పన్ను తగ్గించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు సూచించింది. ఇక ఎయిర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్‌టీని పూర్తిగా తొలగించాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కనీసం పన్నునైనా 5 శాతానికి పరిమితం చేయాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.
ఇవీ చదవండి:
బళ్లారి ఘటనలో.. గాలి, శ్రీరాములుపై కేసు
ఉత్తరాంధ్రకు రైల్వేశాఖ శుభవార్త