Share News

Police Action: బళ్లారి ఘటనలో.. గాలి, శ్రీరాములుపై కేసు

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:50 AM

బళ్లారిలో గురువారం రాత్రి మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పులు, ఘర్షణకు సంబంధించి రెండు వర్గాలపైనా కేసులు నమోదయ్యాయి.

Police Action: బళ్లారి ఘటనలో.. గాలి, శ్రీరాములుపై కేసు

  • మరో 9 మంది బీజేపీ నేతలు, నలుగురు భరత్‌రెడ్డి వర్గీయులపై కూడా

బళ్లారి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): బళ్లారిలో గురువారం రాత్రి మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పులు, ఘర్షణకు సంబంధించి రెండు వర్గాలపైనా కేసులు నమోదయ్యాయి. హవ్వంబావిలోని జనార్దన్‌రెడ్డి ఇంటి వద్ద జరిగిన దాడులు, కాల్పుల ఘటనలో కాంగ్రెస్‌, బీజేపీకి చెందినవారిపై కేసు నమోదు చేశామని కర్ణాటక ఏడీజీపీ హితేంద్ర శుక్రవారం తెలిపారు. గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌ మోత్కర్‌, ప్రకాశ్‌రెడ్డి, పాలన్న, దివాకర్‌, మారుతీ ప్రసాద్‌, దమ్మూరు శేఖర్‌, అలీఖాన్‌ సహా 11 మందిని నిందితులుగా చేర్చామన్నారు. అలాగే బళ్లారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరులు హనుమంత, సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌, చానల్‌ శేఖర్‌పైనా కేసు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మహర్షి వాల్మీకిని అవమానించడంపైనా కేసు పెట్టామన్నారు. ప్రైవేటు గన్‌మెన్‌ నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, కాల్పుల్లో మరణించిన రాజశేఖర్‌ మృతదేహంలో దొరికిన బుల్లెట్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. బళ్లారిలో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

మధ్యాహ్నం ఎస్పీ బాధ్యతలు.. తెల్లారే సస్పెన్షన్‌

బళ్లారి ఘర్షణ, కాల్పులకు సంబంధించి జిల్లా ఎస్పీ పవన్‌ నిజ్దూర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి పవన్‌ గురువారం మధ్యాహ్నమే బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని గంటలకే సస్పెండవడం గమనార్హం.

ప్రైవేటు గన్‌మెన్‌ కాల్చారు..: గాలి

రాజశేఖర్‌ మరణానికి పోలీసు తుపాకీ కారణం కాదని, ప్రైవేటు గన్‌మెన్‌ తుపాకీ నుంచి వచ్చిన తూటాలే కారణమని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అది ఎవరి తుపాకీనో పోలీసులు నిర్ధారిస్తారని మీడియాతో అన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 06:51 AM