MSME Exports: ఎంఎస్ఎంఈ ఎగుమతులకు చేయూత
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:31 AM
ట్రంప్ టారి్‌ఫల యుద్ధంతో అల్లాడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) కేంద్ర ప్రభుత్వం మరో శుభ వార్త చెప్పింది....
రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
వడ్డీ సబ్సిడీ కోసం రూ.5,181 కోట్లు
రుణాల హామీ కోసం రూ.2,114 కోట్లు
న్యూఢిల్లీ: ట్రంప్ టారి్‌ఫల యుద్ధంతో అల్లాడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) కేంద్ర ప్రభుత్వం మరో శుభ వార్త చెప్పింది. ఈ కంపెనీలను ఆదుకునేందుకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు ఈ కంపెనీలు తీసుకునే రుణాలపై వడ్డీ సబ్సిడీ కింద అందజేస్తారు. మరో రూ.2,114 కోట్లు ఈ కంపెనీలు తీసుకునే రుణాలకు హామీగా ఇస్తారు. వచ్చే ఆరేళ్లలో (2025-31) ఈ ప్యాకేజి అమలు చేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భాదూ చెప్పారు. ప్రస్తుత ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల్లో మన ఎంఎ్‌సఎంఈల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజి దోహదం చేస్తుందని తెలిపారు.
ముఖ్యాంశాలు ..
అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈల ఎగుమతులకు మాత్రమే రుణ, వడ్డీ సబ్సిడీ.
ఎగుమతి రుణాలపై 2.75 శాతం వడ్డీ సబ్సిడీ.
ఒక్కో ఎంఎ్‌సఎంఈకి ఏటా రూ.50 లక్షలకు మించకుండా వడ్డీ సబ్సిడీ.
ఎగుమతి రంగంలోని ఒక్కో ఎంఎ్‌సఎంఈ తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు కోసం రూ.10 కోట్లకు మించకుండా హామీ.
సూక్ష్మ, చిన్న కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ రుణ చెల్లింపుల్లో 85 శాతం వరకు, మధ్య తరహా కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ రుణాల్లో 65 శాతం వరకు చెల్లింపులకు హామీ.
జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఏటా మార్చి,సెప్టెంబరు నెలల్లో వడ్డీ రాయితీపై సమీక్ష.
ఆర్‌బీఐ, డీజీఎ్‌ఫటీ సంయుక్తంగా ఈ ప్యాకేజిని అమలు చేస్తాయి.
ఎంపిక చేసిన ఉత్పత్తుల రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలకుమాత్రమే వడ్డీ సబ్సిడీ, రుణ చెల్లింపుల హామీ.
నియంత్రిత వస్తువులు, వేస్ట్, స్ర్కాప్, పీఎల్‌ఐ పథకంలోని ఎంఎ్‌సఎంఈలకు ఈ రాయితీలు వర్తించవు.
రెండో దశలో..
ఎంఎ్‌సఎంఈల ఎగుమతుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులోనే రూ.25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) పేరుతో ప్రత్యేక పథకం ప్రకటించింది. ఈ పథకం రెండో దశలో భాగంగా ప్రభుత్వం తాజాగా ఈ ప్రత్యేక ప్యాకేజి అమలు చేయనుంది. ఈపీఎం పథకం తొలి దశలో ఎంఎ్‌సఎంఈల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం గత ఏడాది డిసెంబరు 31న రూ.4,531 కోట్లు విడుదల చేసింది. ఎగుమతుల రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఈ ప్యాకేజిని ఉద్దేశించినట్టు అజయ్ తెలిపారు.