GST Collections: డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు 2,652 కోట్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో డిసెంబరులో నికర జీఎస్టీ రూ.2,652 కోట్లు వసూలైంది. వసూళ్ల పెరుగుదలలో జాతీయ సగటు 5.61 శాతం ఉండగా..
పెరుగుదల 5.78 శాతం .. దక్షిణాదిలో రెండో స్థానం
అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిసెంబరులో నికర జీఎస్టీ రూ.2,652 కోట్లు వసూలైంది. వసూళ్ల పెరుగుదలలో జాతీయ సగటు 5.61 శాతం ఉండగా.. ఏపీలో 5.78 శాతం ఉన్నట్లు రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఏ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే వసూళ్లలో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండోస్థానంలో ఉన్నామని తెలిపారు. 2025 డిసెంబరులో స్థూలంగా రూ.3,137 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ‘2024 డిసెంబరులో వచ్చిన జీఎస్టీ కంటే గత నెలలో వసూలైన జీఎస్టీ 5.78 శాతం ఎక్కువ. రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) వసూళ్లు 2.46 శాతం మేర పెరిగి రూ.1,102 కోట్లకు చేరుకున్నాయి. 2025 డిసెంబరులో ఐజీఎస్టీ సెటిల్మెంట్ 8.29 శాతం మేర పెరిగి రూ.1,549 కోట్లకు చేరింది. పెట్రోలియం వ్యాట్ ద్వారా రూ.1,448 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 డిసెంబరు కంటే ఈ ఆదాయం 3.89 శాతం ఎక్కువ. వృత్తిపన్ను రూ.42 కోట్లు వసూలైంది. గత నెలలో అన్ని విభాగాల నుంచీ రూ.4,246 కోట్ల పన్ను ఆదాయం వసూలైంది. 2024 డిసెంబరులో వచ్చిన పన్ను ఆదాయం (రూ.4,047 కోట్లు) కంటే ఇది 4.91ు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల నుంచీ రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. 2024లో ఇదే సమయంలో వచ్చిన పన్ను ఆదాయం (రూ.37,804 కోట్లు) కంటే ఇది 4.53ు ఎక్కువ’ అని ప్రకటనలో పేర్కొన్నారు.