Share News

H-1b Visaholders - Amazon: మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్.. భారత్‌లోని హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ అనుమతి

ABN , Publish Date - Jan 02 , 2026 | 08:44 AM

వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 2 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు అంతర్గత నోటీసుల్లో వెల్లడించింది.

H-1b Visaholders - Amazon: మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్.. భారత్‌లోని హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ అనుమతి
Work From Home For Amazon H-1b Employees in India

ఇంటర్నెట్ డెస్క్: వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్‌లో జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన తమ హెచ్-1బీ ఉద్యోగులు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి వరకూ వారికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులు ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు స్పష్టం చేసిన తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం (Amazon Extends Work from Home facility for H-1b Holders in India).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 13 మొదలు భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూలింగ్ కోసం వేచి చూస్తున్న హెచ్-1బీ వీసాదారులను వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు తెలిపింది. మార్చి 2 వరకూ వారికి ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.


అయితే.. వారి కార్యకలాపాలపై కొన్ని పరిమితులు కూడా విధించింది అమెజాన్. కస్టమర్లతో చర్చలు, కోడింగ్, వ్యూహాత్మక నిర్ణయాలు ఏవీ తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. కోడింగ్‌కు సంబంధించి సమస్యల పరిష్కారం, టెస్టింగ్ వంటివి చేపట్టేందుకు వారికి అనుమతి లేదు. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న సమయంలో వారెవరూ ఇక్కడి అమెజాన్ సంస్థలకు వెళ్లకూడదు. ఇక మార్చి 2 తరువాత వీసా అపాయింట్‌మెంట్స్ ఉన్న వారిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

హెచ్-1బీ వీసా విధానానికి ట్రంప్ ప్రభుత్వం భారీ మార్పులు చేయడంతో అనేక అమెరికా సంస్థలు ఇక్కట్ల పాలవుతున్నాయి. వీసా జారీకి ముందు అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీసా రెన్యూవల్స్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ డేట్స్ జూన్ వరకూ వాయిదాపడ్డాయి. దీంతో, అమెరికా‌ను వీడొద్దంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తమ హెచ్-1బీ వీసా ఉద్యోగులకు సూచించాయి.


ఇవీ చదవండి:

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..

ఈ దేశాల్లో పిల్లల భవిష్యత్తుకు భరోసా! అద్భుత జీవితం గ్యారెంటీ

Updated Date - Jan 02 , 2026 | 09:42 AM