ISS New Year Celebrations: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:29 AM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అద్భుత అనుభూతిని మిగులుస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. బాణసంచ వెలుగులు, హర్షధ్వానాల నడుమ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. భూమ్మీద జనాలు ఇలా సంబరాలు చేసుకుంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని (ఐఎస్ఎస్) వ్యోమగాములకు నూతన సంవత్సర వేడుకల అనుభవం పూర్తి భిన్నంగా ఉంటుంది (New Year Celebrations International Space Station).
రోజుకు 16 సూర్యోదయాలు... 16 సూర్యాస్తమయాలు
ఐఎస్ఎస్ గంటకు సుమారు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఒకసారి భూమిని చుట్టి రావడానికి దీనికి కేవలం 90 నిమిషాలే పడతాయి. ఈ వేగం కారణంగా, ఐఎస్ఎస్ 24 గంటల్లో భూమి చుట్టూ దాదాపు 16 సార్లు తిరుగుతుంది. ఫలితంగా వ్యోమగాములు ఒక్కరోజులోనే 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను వీక్షిస్తారు. ఇదే కారణంగా, భూమిపై వేర్వేరు దేశాల్లో న్యూయర్ మారే క్షణాలను కూడా వారు ఒక్కరోజులో పలుమార్లు చూడగలుగుతారు.
అయితే… 16 సార్లు వేడుకలా?
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వ్యోమగాములు 16 సార్లు న్యూయర్ వేడుకలు జరుపుకోరు. ఐఎస్ఎస్‌లో అన్ని కార్యకలాపాలు UTC (Coordinated Universal Time) ఆధారంగానే సాగుతాయి. అందువల్ల వారు అధికారికంగా ఒక్కసారే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే, భూమిపై వేర్వేరు టైమ్‌జోన్లలో న్యూయర్ మారే క్షణాలను అంతరిక్షం నుంచే వీక్షించే అరుదైన అవకాశం మాత్రం వారికి లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో నగరాల వెలుగులు, బాణసంచా కాంతులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
ఐఎస్ఎస్‌లో భారీ స్థాయి సెలబ్రేషన్స్ ఉండవు. వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడటం, అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇక ప్రతి ఏటా నూతన సంవత్సరాన్ని మొదట కిరిబాటీ దేశం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికా ఆధ్వర్యంలోని బేకర్-హౌల్యాండ్ ద్వీపాల్లో నూతన సంవత్సరం చిట్టచివరిగా ప్రవేశిస్తుంది.
ఇవీ చదవండి
ఎలాంటి కాలం దాపురించిందో! ఈ యువతి పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
2009 నాటి ఈ హోటల్ బిల్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.. జస్ట్ రెండు ఇడ్లీలు..