Best Countries For Children: ఈ దేశాల్లో పిల్లల భవిష్యత్తుకు భరోసా! అద్భుత జీవితం గ్యారెంటీ
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:54 AM
నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లల సర్వతోముఖాభివృద్ధిని కోరుకుంటున్నారు. బంగారు భవిష్యత్తును అందించాలని అనుకుంటున్నారు. మరి ఈ కలను సాకారం చేసే దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల పెంపకానికి మించిన బాధ్యత మరొకటి లేదు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు, సామాజిక హోదాతో పాటు వారు ఉండే ప్రదేశాలు కూడా పిల్లల భవిష్యత్తును అమితంగా ప్రభావితం చేస్తాయి. ఇక నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని రకాలుగా బంగారు భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల పెంపకం, కుటుంబంతో కలిసి గడిపేందుకు అత్యంత అనువైన దేశాలు ఏవో గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ రిపోర్టులో తెలిసింది. ఈ నివేదిక ప్రకారం, పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించే దేశాలేవో ఓ లుక్కే్ద్దాం పదండి.
ఫిన్‌ల్యాండ్
ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశం ఫిన్‌ల్యాండ్. పిల్లల పెంపకానికి అత్యంత భద్రమైన దేశంగా జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడి విద్యార్థులు సైన్స్ వంటి సబ్జెక్టుల్లో ఓఈసీడీ ప్రమాణాలకంటే మెరుగ్గా రాణిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పిల్లల జీవితాలకు భరోసా ఇస్తుంది. ఇక్కడ పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు సెలవులూ ఎక్కువగానే ఇస్తారు కాబట్టి సంతానంతో ఎక్కువ సమయం గడపొచ్చు.
డెన్‌మార్క్
ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న డెన్‌మార్క్‌లో ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విధానాలకు రూపకల్పన చేస్తుంది. కాబట్టి, కుటుంబంతో సంతోషంగా జీవించేందుకు ఇది అత్యంత అనువైన దేశంగా పేరుపొందింది.
స్వీడెన్
ఓఈసీడీ ప్రమాణాల కంటే స్వీడెన్ విద్యావ్యవస్థ మెరుగైనది. ఇక్కడి పిల్లలు మాథ్స్, రీడింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో చక్కగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యావ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తాయి. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు 480 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. స్టాక్‌హోమ్, గాథెన్‌బర్గ్ నగరాలు పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలం
నెదర్‌లాండ్స్
పటిష్ఠమైన ప్రజావ్యవస్థలు, స్పష్టమైన వలస విధానాలున్న నెదర్‌లాండ్స్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే అవకాశం ఉంది. ఈయూ బ్లూ కార్డ్ ద్వారా తల్లిదండ్రులు, తమ పిల్లలతో సహా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
నార్వే
ఔట్‌డోర్ యాక్టివిటీస్‌తో పిల్లలకు ఎక్కువ మేలు కలుగుతుందని నార్వే ప్రభుత్వం నమ్ముతుంది. ఇందుకు అనుగుణంగా విద్యావ్యవస్థ రూపొందించింది. పిల్లల సంరక్షణ కోసం అత్యధిక పెయిడ్ లీవ్స్ ఇస్తున్న దేశాల్లో నార్వే కూడా ఒకటి. సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ, వలస విధానాలున్న నార్వే కూడా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది.
కెనడా
ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబంతో సహా హ్యాపీగా ఉండేందుకు కెనడా అత్యంత అనువైన దేశం. భద్రమైన ప్రదేశాలు, పటిష్ఠమైన ప్రభుత్వ పాఠశాలల నెట్వర్క్ కెనడాలో ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, స్టార్టప్ వీసా రూట్‌లల్లో విదేశీయులు కెనడాలో నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
న్యూజిలాండ్
నెమ్మదైన జీవితం, సామాజిక మద్దతు ఉన్న దేశం న్యూజిలాండ్. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఇక్కడి విద్యావ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుంది. పటిష్ఠ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ, ప్రజారవాణా వ్యవస్థ, ప్రశాంతమైన నగర జీవితం వెరసి పిల్లల పెంపకానికి అనువైన దేశంగా న్యూజిలాండ్ పేరుపొందింది.
స్విట్జర్‌ల్యాండ్
ప్రకృతి అందాలతో తొణికిసలాడే ప్రశాంతమైన నగరాలకు స్విట్జర్లాండ్ పెట్టింది పేరు. ఇక్కడ పిల్లలకు వరల్డ్ క్లాస్ విద్య అందుబాటులో ఉంది. ద్విభాషా విద్యావిధానం అమల్లో ఉంది. పటిష్ఠ రైల్ నెట్వర్క్ అందుబాటులో ఉండటంతో ఇక్కడి రాకపోకలు చాలా సులువు. ప్రజారోగ్య వ్యవస్థ వంటివి ఇక్కడి లైఫ్‌ను ఆనందమయం చేస్తాయి.
జర్మనీ
అద్భుత ప్రభుత్వ వ్యవస్థలే జర్మనీ బలం. ఇక్కడి జీవనవ్యయాలు కూడా తక్కువే. కాబట్టి, పిల్లల పెంపకానికి, కుటుంబ ఏర్పాటుకు జర్మనీ అత్యంత అనుకూలం. పబ్లిక్ స్కూల్ వ్యవస్థ, డ్యూయెల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ వంటివి పిల్లల భవిష్యత్తుకు రాజమార్గాలు ఏర్పాటు చేస్తాయి. గొప్ప ప్రజారవాణా వ్యవస్థ, హెల్త్‌కేర్ సర్వీసులు పిల్లలకు అన్ని రకాల భద్రతలూ కల్పిస్తాయి. సమగ్ర వీసా విధానాల కారణంగా జర్మనీ విదేశీయులకు ఎంతో అనుకూలం.
పోర్చుగల్
ప్రశాంతమైన జీవనశైలి, తక్కువ జీవన వ్యయాల కారణంగా పోర్చుగల్ కూడా పిల్లల పెంపకానికి అనుకూలమైన దేశంగా పేరు పొందింది. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రజారోగ్య వ్యవస్థ, రవాణా వ్యవస్థలతో పిల్లల పెంపకం మరింత ఈజీ అవుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. పోర్చుగల్‌లో సెటిల్ అయ్యేందుకు పలు వీసాలు అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఇలాంటి వారికి మిగిలేది జీవితంలో ఒంటరితనమే
మధ్య వయసులో ఈ లక్షణాలు.. రాబోయే మతిమరుపునకు సంకేతం