Dementia: మధ్య వయసులో ఈ లక్షణాలు.. రాబోయే మతిమరుపునకు సంకేతం
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:22 PM
మధ్యవయసు వారిలో కనిపించే కొన్ని డిప్రెషన్ సంబంధిత లక్షణాలు.. వృద్ధాప్యపు మతిమరుపునకు సంకేతాలని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: డిప్రెషన్‌కు, మతిమరుపునకు సంబంధం ఉన్నట్టు అందరికీ తెలిసిందే. అయితే, మధ్య వయసు వారిలో కనిపించే కొన్ని సమస్యలు ముసలితనంలో రాబోయే మతిమరుపునకు సంకేతాలని శాస్త్రవేత్తలు తేల్చారు. 5,811 మందిని పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువగా పురుషులు ఉండటం గమనార్హం
45 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసులో డిప్రెషన్ సంబంధిత సమస్యలతో బాధపడేవారిని దాదాపు 25 ఏళ్లా పాటు జాగ్రత్తగా పరిశోధకులు పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం, పూర్తిస్థాయి డిప్రెషన్‌తో బాధపడే మధ్యవయసు వారు ముసలితనంలో మతిమరుపు బారిన పడే ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉందట. ఇక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న వారిలో ఈ ముప్పు 51 శాతం అధికం. సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు పడే వారు వార్ధక్యంలో మతిమరుపు బారిన పడే ముప్పు 49 శాతం అధికంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇతరుల విషయంలో జాలి, దయ ఇతర సానుకూల భావాలు లేని వారిలో ముసలితనపు మతిమరుపు ముప్పు 44 శాతం అధికం. నిత్యం ఆందోళనతో ఉండేవారిలో డిమెన్షియా రిస్క్ 34 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. తమ జీవితంలో పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తితో గడిపే వారిలో వార్ధక్యపు మతిమరుపు 33 శాతం ఎక్కువని కూడా అధ్యయనకారులు గుర్తించారు. ఏకాగ్రత లోపంతో ఇబ్బంది పడేవారిలో ఈ సమస్య రిస్క్ 2 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. మధ్యవయసు వారిలో కనిపించే కొన్ని సమస్యల్లో భవిష్యత్తు సమస్యల తాలూకు సమాచారం దాగుందని పరిశోధకుల్లో ఒకరైన ఫిలిప్ ఫ్రాంక్ వ్యాఖ్యానించారు. వీటిపై మరింత అధ్యయనం చేస్తే రాబోయే మతిమరుపును ముందుగానే గుర్తించి నివారించే చికిత్సలు అందుబాటులోకి రావచ్చని అన్నారు.
Also Read:
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
For More Lifestyle News