Share News

Lifestyle Feature: తళుక్కున మెరవాలంటే...

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM

ముఖ చర్మాన్ని కాన్వా్‌సగా మలిచి, అందంగా తీర్చిదిద్దడమే మేకప్‌. అందుకోసం కొంత ఓర్పు, నేర్పు అవసరమవుతాయి..

Lifestyle Feature: తళుక్కున మెరవాలంటే...

ముఖ చర్మాన్ని కాన్వా్‌సగా మలిచి, అందంగా తీర్చిదిద్దడమే మేకప్‌. అందుకోసం కొంత ఓర్పు, నేర్పు అవసరమవుతాయి. నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం ఒక ఎత్తైతే, వాటిని తగుమాత్రంగా ముఖానికి అద్దుకోవడం మరొక ఎత్తు. మెరుపులీనే తారలా తళుక్కుమనడం కోసం ఇవిగో ఈ మేకప్‌ కిటుకులు పాటించండి.

షేపింగ్‌: ముఖం కోలగా మలచాలన్నా, గుండ్రంగా తీర్చిదిద్దాలన్నా అందుకు తగిన మేకప్‌ మెలకువలు అనుసరించాలి. షాడో, బ్రాంజ్‌, కాంపాక్ట్‌ల షేడ్‌లను ఆచితూచి ఎంచుకుని, అవసరమైన చోటే అద్దుకోవాలి. ముక్కును తీర్చిదిద్దే తీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే దవడలు, చెవుల దగ్గర డెప్త్‌ను ఏ మేరకు పెంచాలో అంచనా వేయాలి.

ముడతలు: నుదురు, పెదవులు, కళ్ల కింది ప్రదేశాల్లో ముడతలు దాచడం కోసం అవసరానికి మించి కన్‌సీలర్‌ ఉపయోగించకూడదు. సహజసిద్ధమైన లుక్‌ను సొంతం చేసుకోవడం కోసం కళ్ల కింద ఎరుపు రంగు షేడ్‌ను పలుచగా అద్దుకుని, దాని మీద ఫౌండేషన్‌ అప్లై చేసుకోవాలి. కన్‌సీలర్‌ను పలుచగా అద్దుకుని, ఫౌండేషన్‌లో కలిసిపోయేలా చూసుకోవాలి.

హైలైట్‌: ముఖంలో కనుబొమలు, పెదవులు... ఇలా ప్రతి ఒక్కరి ముఖంలో ఏదో ఒక ఆకట్టుకునే అంశం ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని సెంటర్‌ ఆఫ్‌ అటెన్షన్‌గా చేసి, దానికి తగ్గట్టు ముఖాన్ని మలిచే ప్రయత్నం చేయాలి. ఆకర్షణీయమైన కళ్లు ఉన్నవారు బోల్డ్‌ లైనర్‌ను ఉపయోగించాలి. పౌట్‌ను గుర్తించడం కోసం ముదురు రంగు లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి.

లైట్‌గా మొదలు పెట్టి: మేకప్‌ ఉత్పత్తులను వీలైనంత తక్కువగా వాడడం అలవాటు చేసుకోవాలి. కొద్దిగా కన్‌సీలర్‌ను చర్మం మీద అప్లై చేసి బ్రష్‌తో బ్లెండ్‌ చేసుకోవాలి. ఇంకొద్దిగా అవసరం పడితే, మళ్లీ అప్లై చేసుకోవాలి. అలాగే కన్‌సీలర్‌ను అప్లై చేయడం కోసం డో ఫుట్‌ అప్లికేటర్‌ను ఉపయోగించాలి.

ఐ షాడో బ్రష్‌: కనురెప్పల మీద ముడతలు ఉంటే, ఫ్లాట్‌ బ్రష్‌కు బదులుగా ఫ్లఫ్ఫీగా ఉండే బ్రష్‌ వాడాలి. సన్నని మొన కలిగిన బ్రష్‌ వాడడం వల్ల షాడో, కనురెప్పల ముడతల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే చివర్లో క్రీజ్‌ బ్రష్‌తో అదనపు షాడోను తొలగించుకోవాలి.

Updated Date - Aug 16 , 2025 | 01:20 AM