Share News

Lifestyle: దర్జాగా బతికేందుకు దాచేస్తున్నారు..

ABN , Publish Date - Nov 16 , 2025 | 09:35 AM

దంతేరస్‌ వచ్చిందంటే చాలు.. తులమో, అర తులమో బంగారాన్ని కొనుక్కోవడం భారతీయుల సంప్రదాయం. మన పెద్దలు ముందుజాగ్రత్తగా సంస్కృతి సంప్రదాయాల రూపంలో పొదుపు పాఠాలను తరతరాల నుంచీ బోధిస్తూ వస్తున్నారు..

Lifestyle: దర్జాగా బతికేందుకు దాచేస్తున్నారు..

దంతేరస్‌ వచ్చిందంటే చాలు.. తులమో, అర తులమో బంగారాన్ని కొనుక్కోవడం భారతీయుల సంప్రదాయం. మన పెద్దలు ముందుజాగ్రత్తగా సంస్కృతి సంప్రదాయాల రూపంలో పొదుపు పాఠాలను తరతరాల నుంచీ బోధిస్తూ వస్తున్నారు.. ఇలా భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సంస్కృతుల్లో ఇలాంటి పొదుపు అలవాట్లు చాలానే ఉన్నాయి.. అవన్నీ మన జీవితాలకూ అవసరం...

-- -- --

- భారతీయుల ఆర్థిక బలం.. ‘పొదుపు’. పేద, ధనిక అనే తారతమ్యం లేదు. ప్రతీ ఒక్కరూ తమకు చేతనైనంత దాచుకోవడం అలవాటు. ఇది పురాతన కాలం నుంచీ వస్తున్న సంప్రదాయం. దంతేరస్‌ దగ్గర నుంచీ పలు పండగల వరకు.. కుటుంబంలో జరిగే బారసాల నుంచీ పెళ్లిళ్ల వరకు ప్రతీ సందర్భంలో ఎంతోకొంత బంగారం, వెండి ఆభరణాలు, వస్తువుల్ని కొనడం సంప్రదాయం. ప్రతీ భారతీయ కుటుంబంలో కనీసం ఐదు తులాల బంగారమో.. వంద గ్రాముల వెండినో ఉండనే ఉంటుంది. హోళీలాంటి పండగల్లో రాఖీలు కట్టిన సోదరీమణులకు సోదరులు ఎంతోకొంత డబ్బులను ప్రేమతో ఇస్తుంటారు. ఇది కూడా ఒక పొదుపు సంస్కృతేనని చెప్పొచ్చు.


book4.jpg

- జపాన్‌లో అతి పురాతన కాలం నుంచీ వస్తున్న మరొక పొదుపు సంస్కృతి ‘కకీబో’. జపనీస్‌ కుటుంబాల్లో చాలామంది భక్తి శ్రద్ధలతో పద్దులు రాస్తుంటారు. మన భారతీయుల్లోనూ ఇదే పద్ధతి ఎప్పటి నుంచో వస్తున్నది. జపనీస్‌లో కకిబో అంటే జమా ఖర్చులను డైరీలో రాయడం. జపాన్‌లో ఎక్కువశాతం కుటుంబాల్లో ఆర్థిక క్రమశిక్షణ బాగుంటుంది. తాము సంపాదిస్తున్న ప్రతీ రూపాయికీ విలువనిస్తూ.. అవసరమైన వాటికే ఖర్చు చేస్తారు. అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టరు. పేదలు, ధనికులు అన్న తేడాలేకుండా జపాన్‌లోని ప్రతీ ఇంట్లోని పిల్లలతో కకిబో రాయిస్తారు తల్లిదండ్రులు. పాకెట్‌ మనీ కింద వంద రూపాయలిస్తే.. దేనికి ఎంత ఖర్చు చేశారు? తప్పకుండా డైరీ రాయాల్సిందే!. పెద్దలు కూడా విధిగా ప్రతీ రోజూ జమాఖర్చుల పద్దును రాస్తారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎంత పారదర్శకంగా ఉంటే మానవ సంబంధాలు అంత బలంగా ఉంటాయన్నది జపనీయుల విశ్వాసం.


book4.3.jpg

- చైనాలో వేడుకలకు వెళితే చాలు.. ఎరుపు రంగు కవర్లు పట్టుకుని కనిపిస్తారు అతిథులు. ఆ కవర్ల పేరు ‘హాంగ్‌బవొ’. వాటిలో డబ్బులుంటాయి. మన పెళ్లిళ్లకు వచ్చిన అతిథులు వధూవరులకు నగదు ఇచ్చినట్లే చైనాలో హాంగ్‌బవొను ప్రేమగా ఇస్తారు. అప్పుడప్పుడే జీవితంలోకి ప్రవేశిస్తున్న యువతీయువకులకు హంగ్‌బవొ భరోసానిస్తుంది. చేతి ఖర్చులకు పనికొస్తుందన్నది చైనీయుల అభిప్రాయం. లునార్‌ న్యూ ఇయర్‌, వివాహాలలో ఈ ఎరుపుకవర్లలో డబ్బులు పెట్టి ఇస్తుంటారు. అక్కడిది బాగా ప్రాచుర్యం పొందిన పొదుపు అలవాటు.


- ఇప్పుడు ప్రపంచమంతా ఆన్‌లైన్‌ లావాదేవీలు నడుపుతోంది. ప్రతీ దానికీ యెడాపెడా క్రెడిట్‌కార్డులు వాడేస్తోంది. కానీ అభివృద్ధి చెందిన జర్మనీ దేశం మాత్రం నగదునోట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తోంది. భారతీయుల ఇళ్లలో లక్ష్మీదేవిని సిరి సంపదలకు ప్రతీకగా ఎలా కొలుస్తారో.. జర్మనీలో కూడా నగదును అంతే భక్తితో పూజిస్తారు. ప్రతీ ఇంట్లో ఎంతోకొంత నగదును ఉంచుకోవడం సంప్రదాయం. ‘‘డబ్బు అనేది కేవలం భావన మాత్రమే కాదు. స్పర్శతో కలిగే భరోసా కూడా!. ఎన్ని డిజిటల్‌ లావాదేవీలు చేసినా.. నగదు చేతిలో ఉన్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది.. అందుకే ప్రతీ జర్మన్ల వాలెట్లు ఖాళీగా ఉండవు. కనీసం రెండు మూడు కరెన్సీ నోట్లు అయినా పర్స్‌లో ఉంటాయి’’ అంటారు అక్కడి ఆర్థిక సలహాదారులు.


- మన దగ్గర డ్వాక్రా సంఘాలు ఉన్నట్లే.. మెక్సికో, లాటిన్‌ అమెరికా దేశాల్లో ‘టండస్‌’ అనే సేవింగ్‌ క్లబ్‌లు ఉన్నాయి. పల్లెల నుంచీ పట్టణాల వరకు ఇలాంటి సంఘాలు అనేకం. ఇందులో చేరిన సభ్యులు కొంత మొత్తంలో క్రమం తప్పకుండా పొదుపు చేస్తారు. అవసరమైనప్పుడు తీసుకుంటారు. ఈ మొత్తానికి ఎలాంటి వడ్డీ ఉండదు. కుటుంబాల్లో తరచూ వచ్చే ఆర్థిక అవసరాలకు ఈ డబ్బు సర్దుబాటు అవుతుంది. చాలా ఊరట లభిస్తుంది. అత్యవసరం వచ్చినప్పుడు అధిక వడ్దీలకు అప్పులు చేయకుండా పనికొస్తుంది. మెక్సికో నుంచీ అమెరికాకు వలస వెళ్లిన అనేక మంది వ్యవసాయ కార్మికులు తమ సొంత ఊళ్లలోని సేవింగ్‌ క్లబ్స్‌లో డబ్బులు దాచుకోవడం విశేషం.

Updated Date - Nov 16 , 2025 | 09:35 AM