Share News

Hyderabad: సిటీలో యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌...

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:15 AM

కల్తీని నిరోధించేందుకు ప్రత్యేకంగా ఏర్పడ్డ యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌... రంగంలోకి దిగుతోంది కల్తీని నిరోధించేందుకు ప్రత్యేకంగా యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌ (వైఎఫ్‏టీ) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రతి వస్తువులోనూ కల్తీ జరుగుతోంది. దీన్ని నిరోధించేందుకే ప్రభుత్వం ఈ యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది.

Hyderabad: సిటీలో యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌...

- కల్తీ కేటుగాళ్లకు ఇక చెక్‌

- ప్రణాళికలు సిద్ధం చేసిన సీపీ

- కల్తీ కార్ఖానాలకు అడ్డాగా శివారు ప్రాంతాలు

- యథేచ్ఛగా మార్కెట్లోకి సరఫరా

హైదరాబాద్‌ సిటీ: నగరంలో కల్తీ సరుకుల కేటుగాళ్లకు ఇక చెక్‌ పడనుంది. వీరి ఆట కట్టించేందుకు నగర సీపీ సజ్జనార్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌ (వైఎఫ్‏టీ) పేరిట ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు. ఈ బృందాలు కల్తీ సరుకుల కేటుగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా కార్ఖానాలను సమూలంగా నిర్మూలించనున్నారు. కొత్త సంవత్సరంలో ఇక కల్తీ సరుకుల అంశాలు తెరపైకి రాకుండా చర్యలు చేపట్టేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.


మార్కెట్లో కల్తీ సరుకులు..

చిన్న పిల్లలకు పట్టించే పాలు మొదలుకొని వంటచేసుకునే బియ్యం, నూనె, కారం, పసుపు, శనగపిండి, నెయ్యి, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సబ్భులు, టీపొడి, చివరికి కోళ్లకు వేసే దాణాతో సహా ప్రతి వస్తువు కల్తీనే. ప్రస్తుతం కల్తీ వస్తువులు మార్కెట్‌ను ముంచెతుత్తున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా.. ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాండెడ్‌ పేరుతో ఉన్న వస్తువులను సైతం కొందరు కేటుగాళ్లు అదే పేరుతో కల్తీ చేసి అసలుకు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ వస్తువులను తయారు చేస్తున్నారు. బ్రాండ్‌ పేరు చూసి నకిలీ వస్తువులు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు.


అడ్డాగా శివారు ప్రాంతాలు..

ఒకప్పుడు గ్రామాలకు పరిమితం అయిన కల్తీ సరుకులు ఇప్పుడు పట్టణాల్లోనూ విపరీతంగా పెరిగింది. నగరంలోని నాలుగు కమిషనరేట్స్‌ పరిధిలోని శివారు ప్రాంతాలు కల్తీ కార్ఖానాలకు అడ్డాగా మరుతున్నాయి. ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అడపాదడపా దాడులు నిర్వహించి కల్తీగాళ్లను కటకటాలకు పంపుతున్నా.. ఈ దందాకు మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌, ఫ్యూచర్‌సిటీ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీ కేటుగాళ్లు తమ అడ్డాలుగా మార్చుకుంటున్నారు.


city5.2.jpg

హైదరాబాద్‌ పరిధిలోని పహడీషరీఫ్‌, జల్‌పల్లి, శ్రీరాంనగర్‌ కాలనీ, మీర్‌పేట, నాదర్‌గుల్‌, బడంగ్‌పేట, ఆదిభట్ల, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మల్కాజిగిరి పరిధిలోని హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, ఘట్‌కేసర్‌, కీసర, మేడిపల్లి, మేడ్చల్‌ తదితర ప్రాంతాలు, సైబరాబాద్‌ పరిధిలోని బాలానగర్‌, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి(Balanagar, Jeedimetla, Mylardevpally), పటాన్‌చెరు, ఫ్యూచర్‌సిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం తదితర ప్రాంతాలను కల్తీ కేటుగాళ్లు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల కంటపడకుండా చిన్న షెడ్డులు, రూములు ఏర్పాటు చేసి కల్తీ పదార్థాలను తయారు చేసున్నారు.


క్రిమినల్స్‌ భయపడేలా..

కల్తీ సరుకులను తయారు చేయాలన్నా, వాటిని మార్కెట్లోకి తేవాలన్నా ఆయా కేటుగాళ్లు భయపడేలా యాంటీ ఫ్యాట్‌ టీం (వైఎ్‌ఫటీ) కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. వైఎ్‌ఫటీల పర్యవేక్షణకు ఓ డీసీపీ అధికారిని నియమిస్తున్నాం. శివారు జోన్‌లలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఆహార కల్తీపై ప్రత్యేక నిఘా ఉంటుంది. పాత డేటా ఆధారంగా కల్తీ కేటుగాళ్లను నగరంలో కనిపించకుండా చేస్తాం. కల్తీకాటును సమూలంగా ప్రక్షాళన చేస్తాం.

- వి.సి. సజ్జనార్‌, పోలీస్‌ కమిషనర్‌, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు

ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Jan 03 , 2026 | 10:15 AM