Vijayawada Court: నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:33 AM
కోర్టులో సాక్ష్యం చెప్పడమంటే రాసుకొచ్చి చదవడం కాదు. ఏం చెప్పదలచుకున్నారో అదే చెప్పాలి’’ అంటూ ఓ సాక్షికి విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఎ.సత్యానంద్ స్పష్టం చేశారు....
కాగితంపై రాసుకొచ్చింది చూసి సాక్ష్యం చెప్పడం కుదరదు
సాక్షిపై విజయవాడ రెండో ఏడీజే కోర్టు న్యాయాధికారి ఆగ్రహం
విజయవాడ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టులో సాక్ష్యం చెప్పడమంటే రాసుకొచ్చి చదవడం కాదు. ఏం చెప్పదలచుకున్నారో అదే చెప్పాలి’’ అంటూ ఓ సాక్షికి విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఎ.సత్యానంద్ స్పష్టం చేశారు. విజయవాడలో అభయగోల్డ్ సంస్థ మోసంపై సీఐడీ నమోదు చేసిన కేసు ట్రయల్ శుక్రవారం ప్రారంభమైంది. మల్టీ మార్కెటింగ్ స్కీముల్లో భాగంగా ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తానికి వస్తువులు గానీ, ప్లాట్ గానీ ఇస్తామని ప్రకటించిన ఈ సంస్థ తర్వాత బోర్డు తిప్పేసింది. దీనిపై సీఐడీ 2013లో కేసు నమోదు చేసింది. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై ట్రయల్ ప్రారంభం కావడంతో మొదటి సాక్షి మత్తయ్యను కోర్టుకు పిలిపించారు. అభయగోల్డ్ సంస్థకు ఎంత డబ్బు చెల్లించావని న్యాయాధికారి ప్రశ్నించడంతో.. తనకు సరిగ్గా గుర్తు లేదని, కాగితం చూసి చెప్తానని ఆయన తెలిపారు. దీనిపై న్యాయాధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాసుకొచ్చిన కాగితాలు చూసి సాక్ష్యం చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఎంతో దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నానని, మర్చిపోయిన విషయాలను చూసి చెబుతున్నానని మత్తయ్య వాదించారు. దీనిపై న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వేమీ టీచర్‌వి కాదు. మాకు పాఠాలు చెప్పొద్దు’’ అంటూ చురకలు వేశారు. అభయ గోల్డ్‌కు ఎంత మొత్తంలో చెల్లింపులు చేశావో చెప్పాలని సూచించారు. కట్టిన మొత్తం సరిగ్గా చెప్పకపోయినా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అనంతరం కాగితం చదువుకుని వచ్చి సాక్ష్యం చెప్పడానికి మత్తయ్యకు కొంత సమయం ఇచ్చారు.