ఎండల్లో హాయ్ హాయ్..
ABN , Publish Date - May 19 , 2026 | 10:15 AM
దాదాపు 10 రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. మరోవైపు వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నుంచి 23వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పుల తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించారు.
వేసవి తాపం తీర్చేలా పలు రకాల పానీయాలు
అందుబాటులో కొబ్బరిబొండాలు.. చెరుకురసం
రహదారుల వెంట తాటిముంజల అమ్మకం
కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్న ప్రజలు
చిరువ్యాపారులకు ఉపాధి
హైదరాబాద్: దాదాపు 10 రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. మరోవైపు వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నుంచి 23వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పుల తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే పలుచోట్ల 42డిగ్రీల నుంచి 44డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇవి మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎండ వేడిమి తట్టుకునేలా తగు జాగ్రత్తలు పాటించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
వడదెబ్బ సోకకుండా ప్రజలు వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవడంతో పాటు సహజసిద్ధంగా లభించే పానీయాలపై దృష్టిసారించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందులో ముఖ్యంగా కొబ్బరిబొండాలు.. తాటిముంజలు, చెరుకురసాలు ప్రజలకు అందుబాటులో లభిస్తున్నాయి. రహదారుల వెంబడి తాటిముంజలు కూడా 15 రోజులుగా అందుబాటులోకి రావడంతో చిన్న, పెద్ద అన్న తేడాలేకుండా తాటి ముంజలను కొనుగోలు చేస్తున్నారు.
ఆరోగ్యానికి మేలు చేసే చెరుకు రసం..
చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన చెరుకు రసం మిషన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడంతో రహదారుల వెంబడి, పలు కాలనీల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. రూ.20 నుంచి రూ.25 వరకు గ్లాస్ చెరుకు రసం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇవి కూడా రూ.60 నుంచి రూ.70 వరకు లీటర్ చొప్పున దుకాణదారులు అమ్ముతుండటంతో ప్రజలు కూడా తీయటి పానీయం చెరుకు రసంపై ఆసక్తి కనబరుస్తున్నారు.
రహదారుల వెంబడి తాటిముంజలు..
వేసవికాలంలో తాటి ముంజలు తీసుకోవడంతో ఎంతో చలువ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెల రోజులుగా నగరంలో ఎక్కడచూసినా రహదారుల వెంబడి, ఫుట్‌పాత్‌ల పక్కనే ఆటోలో తీసుకువచ్చిన తాటి ముంజలు మనముందే ఒలిచి ఇస్తుండడంతో ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. రూ.120నుంచి రూ. 150వరకు డజను(12) తాటిముంజలు విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల తాటిముంజలు కవర్‌లో పెట్టి అమ్మకాలు చేస్తున్నారు.
అందుబాటులో కొబ్బరి బొండాలు..
ఏ కాలంలోనైనా లభించే సహజసిద్ధమైన కొబ్బరిబొండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేసవిలో కొబ్బరిబొండ అమృతబాండమేనని చెప్పాలి. వేసవి దప్పిక తీర్చడంలో దీన్ని మించింది మరొకటి లేదు. రూ.30 మొదలుకుని రూ.60వరకు రోడ్లపైన ఫుట్‌పాత్‌లలో దుకాణదారులు అమ్ముతున్నారు. లీటర్ బాటిల్‌కు రూ.120 వరకు విక్రయిస్తున్నట్లు కొబ్బరిబొండాల వ్యాపారి ఒకరు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నాలుగు రోజుల్లో రెండోసారి..
తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..
Read Latest AP News And Telangana News And International