Share News

కాంగ్రెస్‌ పని ఖతం

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:08 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పని ఖతం
Bandi Sanjay Kumar

  • తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

  • బీఆర్‌ఎస్‌ను ప్రజలే బొందపెట్టారు

  • రేవంత్‌రెడ్డి మహేశ్వరం పారిపోవాల్సిందే

  • ఈసారి వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే

  • కరీంనగర్‌లో లక్ష మందితో ‘మహా పాదయాత్ర’!

  • ‘సర్‌’పై దుష్ప్రచారానికి ఇదే చెంపపెట్టు

  • రాహుల్‌గాంధీకి మెదడు మోకాలిలో ఉంది

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆ పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం కొడంగల్‌ను వదిలి మహేశ్వరం పారిపోక తప్పదన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారని, ఈసారి వచ్చేది డబుల్‌ ఇంజిన్‌ సర్కారేనని చెప్పారు. ఉమ్మడి ఓటరు జాబితా సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ పార్టీ, ఇండీ కూటమి దుష్ప్రచారం చేస్తున్నాయని, రాహుల్‌గాంధీకి మెదడు మోకాలిలో ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఈ నెల 23న తొలిసారిగా కరీంనగర్‌ గడ్డపై అడుగు పెడుతున్నారని, ఇండి కూటమి దుష్ప్రచారానికి చెంపపెట్టుగా లక్ష మందికిపైగా ప్రజలతో ‘మహా పాదయాత్ర’ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..


తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుంది. ఇప్పుడున్న మంత్రుల్లో 80 శాతం మంది ఓడిపోవడం ఖాయం. అంతెందుకు.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొడంగల్‌ను వదిలేసి మహేశ్వరం నియోజకవర్గానికి పారిపోక తప్పదు. ఇది నా మాట కాదు.. కాంగ్రెసోళ్లు అంతర్గతంగా చెబుతున్నదే. సీఎం, పీసీసీ అద్యక్షుడు, ఏఐసీసీ ఏ సర్వే చేయించుకున్నా కాంగ్రెస్‌ గెలిచే అవకాశాల్లేవని, ప్రజలంతా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని నివేదికలు ఇస్తున్నాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లడం లేదు. ఉప ఎన్నికలకు సిద్ధపడటం లేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఊసే ఎత్తడంలేదు. బీఆర్‌ఎ్‌సను తెలంగాణ ప్రజలే బొంద పెట్టారు. 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా పెర్మార్మెన్స్‌ చూపలేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్ధిని బరిలోకి దింపే సాహసం కూడా చేయలేకపోయింది. రేవంత్‌రెడ్డి చెప్పినదాంట్లో ఒకటైతే నిజముంది. అవినీతిలో, అక్రమాల్లో, దోపిడీలో, కుటుంబ పాలనలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుంది. అందులో బీజేపీ ఉనికే ఉండదు. మోదీ, నితిన్‌ నబీన్‌ ఆధ్వర్యంలోని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అవినీతి, అరాచకాలు, కుటుంబ పాలనకు వ్యతిరేకం. ప్రజలంతా ఇవన్నీ గమనిస్తున్నారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయి.


దేశ వ్యాప్తంగా 14 కోట్ల ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగించిందని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు కదా?

రాహుల్‌గాంధీకి మెదడు మోకాలిలో ఉన్నట్లుంది. ఆయన మాట్లాడే మాటలను జనం సీరియ్‌సగా తీసుకోవడమే మానేశారు. ఆయన మాట మీద నిలబడే నాయకుడు కాదు. ఏదైనా ఒక అంశం వచ్చిందంటే.. మాట్లాడటం, సవాల్‌ విసిరితే పారిపోయి మరో అంశాన్ని లేవనెత్తడం ఆయన నైజం. మొన్నటి దాకా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం వల్లే బీజేపీ గెలిచిందన్నారు. మరి అదే ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచింది కదా? మరి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసిందా? రాహుల్‌గాంధీ ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి కదా? తెలంగాణలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్‌ ద్వారానే జరిగినా.. రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ దారుణంగా ఓడిపోయి.. బీజేపీయే గెలిచింది కదా? మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా 28 ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 27 స్థానాల్లో ఎందుకు ఓడిపోయింది? దీనికి సమాధానం చెప్పాలని అడిగితే.. ఆ అంశాన్ని పక్కకుపెట్టి సర్‌ పేరుతో 14 కోట్ల మందిని తొలగించారని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని ధర్నాలు, ఆందోళనల పేరుతో రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను అపహాస్యం చేస్తున్నారు.


14 కోట్ల ఓట్లను ఎన్నికల సంఘం ఇప్పటివరకు తొలగించనేలేదు. ఇది కేవలం ముసాయిదా మాత్రమే. వాస్తవాలు ఏంటంటే.. 4 కోట్ల మందికిపైగా ఓటర్లు చనిపోయారు. 6.50 కోట్ల మంది ఓటర్లు తమ నివసిస్తున్న ప్రాంతాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లారు. వాళ్లు కొత్త ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. కోటి మందికిపైగా ఓటర్లు రెండు, మూడు చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. 2014కు ముందు విదేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్నవారు దాదాపు 4 కోట్ల మంది ఉన్నారు. ఆ ఓట్లను తొలగించాలా? వద్దా? ఈ దేశంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అదికారం ఈ దేశ పౌరులకే ఉండాలా? లేక బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి ఉండాలా? ఓటరు నమోదు అనేది నిరతంతరం జరిగే ప్రక్రియ. దీనికి రాద్ధాంతం చేయడం ఎందుకు?


దేశవ్యాప్తంగా 14 కోట్ల ఓట్లను తొలగించారన్న కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదా?

రాహుల్‌గాందీకి సవాల్‌ విసురుతున్నా. 14 కోట్లు కాదు.. అర్హులైన 14లక్షల మంది ఓట్లను కూడా తొలగించలేదని నేను చెబుతున్నా. రాహుల్‌ వద్ద ఆధారాలుంటే అర్హత ఉండి ఓటు కోల్పోయిన 14 కోట్ల మంది ఆదారాలు బయటపెట్టమనండి. ఈసారి ధర్నా చేసే ప్రాంతానికి ఓటుహక్కు కోల్పోయిన కనీసం 14 లక్షల మందినైనా తీసుకొచ్చి ఆధారాలతో మీడియా ముందు ప్రవేశపెట్టమనండి. ఆ ఆధారాలను కోర్టు ముందు ఉంచమనండి. ఇవేవీ రాహుల్‌ గాంధీ వద్ద లేవు కాబట్టే ఇప్పటివరకు మా సవాల్‌ను స్వీకరించడంలేదు. ఎక్కడైనా పొరపాటున బీఎల్వోలు నిజమైన ఓటరు పేరును తొలగించినా వెంటనే మళ్లీ ఆధారాలతో వెళ్లి నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది కదా? కాంగ్రెస్‌ పార్టీ ఆ పని ఎందుకు చేయడం లేదు?


పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంతో సీఈసీని తొలగించాలని ఇండీ కూటమి డిమాండ్‌ చేస్తోంది కదా?

దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి బహిష్కరించారు. అందుకే ఒకప్పుడు దేశంలో 30 రాష్ట్రాల్లో అదికారంలో ఉన్న ఆ పార్టీ ఇవాళ 4 రాష్ట్రాలకే పరిమితమైంది. దేశంలో రాహుల్‌ గాంధీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మాటలను నమ్మి ఫాలో అయిన రాజకీయ పార్టీలు, నాయకులంతా తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోతూనే ఉన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించమనండి. రాహుల్‌తోపాటు ఇండీ కూటమికి పార్లమెంట్‌ వేదికగా సరైన గుణపాఠం చెప్పేదుకు మేం సిద్ధంగా ఉన్నాం. సర్‌పై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను బద్నాం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాహుల్‌గాంధీ ఎలా అపహాస్యం చేస్తున్నారో, విదేశీ శక్తులతో కలిసి భారత్‌ ప్రతిష్ఠను, ప్రధాని ప్రతిష్ఠను ఎలా దెబ్బతీస్తున్నారో ఆధారాలతో సహా బయటపెట్టి ఆయన నిజస్వరూపాన్ని దేశ ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం.


డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఈసారైనా ఆమోదం పొందుతుందా? బీజేపీ కాస్త వెనక్కి తగ్గినట్లుంది?

మోదీ, అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌ త్రయం ఎంతటి క్లిష్టమైన అంశమైనా ఆచితూచి, లోతుగా ఆలోచించిన తరువాతే అడుగు ముందుకేస్తారు. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి అంశాలే ఇందుకు నిదర్శనం. అన్నీ ఆలోచించిన తరువాతే డీలిమిటేషన్‌, మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇక యూటర్న్‌ తీసుకోవడమనేదే ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని గిమ్మిక్కులు, ఎంతటి దుష్ప్రచారం చేసినా రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ రెండు బిల్లులను ఆమోదించుకోవడం తథ్యం.


నితిన్‌ నబీన్‌ కరీంనగర్‌ రావడానికి అసలు కారణం ఏంటీ?

నితిన్‌ నబీన్‌ ఈ నెల 23న కరీంనగర్‌ వస్తున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకత్వాన్ని పాతరేద్దాం’ పేరిట నిర్వహించే మహాపాదయాత్రలో ఆయన పాల్గొంటారు. ‘సర్‌’కు మద్దతుగా లక్ష మందికిపైగా ప్రజలు నితిన్‌ నబీన్‌తో కలిసి మహాపాదయాత్రలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ‘సర్‌’పై, రాజ్యాంగబద్ధ సంస్థలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారానికి చెంపపెట్టుగా ఒకే ఒక్క కరీనంగర్‌ పార్లమెంట్‌ పరిధి నుంచే లక్ష మందికిపైగా ఈ మహాపాదయత్రకు హాజరు కాబోతున్నారు. సర్‌పై ఉన్న సందేహాలన్నీ ఈ యాత్రతో పటాపంచలు చేస్తాం.


ఒక్క కరీంనగర్‌ నుంచే లక్ష మంది జనసమీకరణ సాధ్యమా?

కచ్చితంగా లక్ష కంటే ఎక్కువ మంది మహా పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. సర్‌పై తొలుత ప్రజల్లోనే అపోహలు నెలకొనడానికి కారణం కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేసిన దుష్ప్రచారమే. కొన్ని మీడియా సంస్థలు కూడా కాంగ్రెస్‌ చెప్పింది నిజమే అనుకుని కథనాలు రాశాయి. అర్హులైన వారి ఓట్లను తొలగించి బీజేపీకి అనుకూలుర ఓట్లను మాత్రమే నమోదు చేయిస్తారనే భావన కలిగింది. కానీ.. ఆచరణకు వచ్చేసరికి తెలంగాణతో పాటు దేశ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ‘సర్‌ జరగాల్సిందే. 18 ఏళ్లు నిండిన ఈ దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిందే. మరణించిన వాళ్ల ఓట్లను తొలగించాల్సిందే. డూప్లికేట్‌ ఓట్లను ఏరిపారేయాల్సిందే. 2014కు ముందు విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఓట్లు పొందిన వాళ్లను తొలగించాల్సిందే’ అని ప్రజలు కోరుకుంటున్నారు. సర్‌కు ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారనేదానికి కరీంనగర్‌లో జరగబోయే మహాపాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలిరావడం నిదర్శనం కాబోతోంది.


దేశంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?

దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్‌ బారిన పడి యువత, పిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది మనల్నే కాదు.. దేశ ప్రధాని నరేంద్రమోదీని కూడా తీవ్రంగా కలచివేస్తున్న అంశం. అందుకే ‘నషా ముక్త్‌ భారత్‌’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సలైట్లను నిర్మూలించి ‘నక్సల్‌ ముక్త్‌ భారత్‌’ సంకల్పాన్ని ఏ విధంగా సాకారం చేశారో... రాబోయే రోజుల్లో ‘నషా ముక్త్‌ భారత్‌’ నినాదం కూడా సాకారం కావడం తథ్యం. మోదీ సహా బీజేపీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి డ్రగ్స్‌ను నిర్మూలించడం, రెండోది డ్రగ్స్‌ బారిన పడిన యువతకు, పిల్లలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి సన్మార్గంలో నడిపించడం.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 03:13 AM