తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: బల్మూరి వెంకట్
ABN , Publish Date - Sep 15 , 2026 | 03:58 PM
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కంటే ఎక్కువ తిట్లు తిట్టగలమని.. కానీ తల్లిదండ్రులు తమకు విజ్ఞత నేర్పించారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ కంటే ఎక్కువ తిట్లు తిట్టగలం.. కానీ తల్లిదండ్రులు మాకు విజ్ఞత నేర్పించారు. కేటీఆర్ ప్రవర్తనను చూసి సిగ్గనిపిస్తోంది. ఒక కులానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసిన తప్పుకు కులం అంతా తల దించుకుంటోంది’ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా తయారైందని విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ పీఏ, పీఆర్వో ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందన్నారు.
స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఎలాంటి భాష ఉపయోగించారో.. కేటీఆర్ పీఏ, పీఆర్వో కూడా అలాగే మాట్లాడారని వెంకట్ మండిపడ్డారు. ఇంకా తామే అధికారంలో ఉన్నామని.. కేటీఆర్ రాష్ట్రానికి యువరాజు అన్నట్లుగా వీళ్ల తీరు ఉందంటూ ఫైర్ అయ్యారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగిందని కేటీఆర్, హరీశ్ రావు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారని తెలిపారు. గణేశ్ మండపం డీజే అనుమతి కోసమే కొందరు యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. కేటీఆర్ పీఏ, పీఆర్వోల గురించి ఎవరికీ తెలియదన్నారు.
తాతా మధుతో పాటు చివరకు కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులను దూషిస్తున్నారంటే వాళ్ల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చని వెంకట్ అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏనాడూ తాము ఇలాంటి భాష, ఇలాంటి ప్రవర్తన చేయలేదని చెప్పుకొచ్చారు. పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారన్నారు. మీడియాలో కనిపించాలన్న ఆరాటంతోనే బీఆర్‌ఎస్ నాయకులు హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం ఏ అఘాయిత్యమైనా చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందంటూ మండిపడ్డారు. కేటీఆర్ పీఆర్వో పోలీసులపై చెప్పరాని భాషలో దూషణలు చేశారన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని హితవుపలికారు. తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నీ పీఏ, పీఆర్వోలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేకుంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా పక్కటెముకలు విరిగిపోయాయి. అయినా ఏనాడూ పోలీసులపై నేను దూషణలు చేయలేదు’ అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు
Read Latest Telangana News And Telugu News