ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ABN , Publish Date - Sep 15 , 2026 | 02:18 PM
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. ఈరోజు విశాఖలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 15: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) కన్నుమూశారు. 57 ఏళ్ల నాని ఈరోజు(మంగళవారం) విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికా, రెండో కుమారుడు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసం చేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన నాని.. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. 1999లో ఎన్నికల్లో మరోసారి ఓటమి ఎదురైంది.
ఆ తర్వాత 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004- 2013 వరకు ఏపీ శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున అసెంబ్లీ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓడిన ఆళ్ల నాని.. 2024 ఆగస్టు 17న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 13న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్ల నాని మృతితో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News